అయోమయంలో కృష్ణయ్య!

 

నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణా తెదేపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా హటాత్తుగా తెర మీదకు వచ్చిన ఆర్. కృష్ణయ్య, తెదేపా-బీజేపీ కూటమి విజయం సాధించలేకపోవడంతో ఆయన ఎల్బీ నగర్ నియోజక వర్గం నుండి గెలిచినా ఫలితం దక్కలేదు. ఎన్నికల సమయంలో టికెట్ సంపాదించుకోవడానికే అతిరధ మహారధుల వంటి రాజకీయనాయకులు, ప్రముఖులు పోటీలు పడుతుంటారు. కానీ వారికి దక్కని ఆ సువర్ణావకాశం ఆయాచితంగా కృష్ణయ్యకి దక్కింది. ఎల్బీ నగర్ నియోజక వర్గం నుండి ఎన్నికలలో విజయం సాధించగలిగారు కూడా. బీసీ సంఘాల నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న కృష్ణయ్య రాజకీయాలలో మాత్రం రాణించలేకపొతున్నారు. అందుకు కారణం తెదేపాలో తనకు సముచిత గౌరవం దక్కడం లేదనే భావనతో ఆ పార్టీ నుండి దూరం కావడమేనని చెప్పవచ్చును.

 

తెదేపాకు దూరం అయిన తరువాత తెరాసకు దగ్గరయినా ఏదో ఒక ఫలితం కనబడేది. కానీ తెరాస అధినేత కేసీఆర్ కూడా ఆయనపై అంత ఆసక్తి చూపకపోవడంతో ఆయన పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయింది. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన తరువాత బీసీలకు ఆయన ఏదయినా మేలు చేయగలిగినా ఆయనకి బీసీ సంఘాలలో మంచి పేరు వచ్చి ఉండేది. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీలు రెంటికీ ఆయన సమాన దూరం పాటిస్తుండటంతో ఆయన బీసీలకు కూడా ఏమీ చేయలేకపోయారు. సాధారణంగా ఎవరయినా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన తరువాత ప్రజలలో గుర్తింపు, ప్రత్యేక గౌరవం అందుకొంటారు. కానీ కృష్ణయ్య పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అటు రాజకీయాలలో రాణించలేక, బీసీ సంఘాల ఆదరణ పొందలేక ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారిప్పుడు.