తుమ్మల ఇన్.. పువ్వాడ అవుట్! అందుకేనా కేటీఆర్ కు కౌంటర్?

తెలంగాణ కేబినెట్‌కు బీట‌లు వారే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అంటున్నారు. మంత్రి మండ‌లి ముక్క‌ల‌య్యే అవ‌కాశం త్వ‌ర‌లోనే రావొచ్చ‌ని చెబుతున్నారు. కొంద‌రి ప‌ద‌వులు ఊస్ట్ అవ‌డం ప‌క్కా అని తెలుస్తోంది. హుజురాబాద్ ఎన్నిక‌ల వ‌ల్ల ఆల‌స్యం అవుతోంద‌ని.. ఆ ఎల‌క్ష‌న్ ముగిశాక‌.. కేబినెట్‌లో ఇన్ & అవుట్‌లు ఉంటాయ‌ని స‌మాచారం. మ‌రోవైపు, ప‌లువురు పార్టీ నేత‌లు కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని.. ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్స్ వ‌ర‌కూ వెయిట్ చేసి.. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని అంటున్నారు. ఆ మేర‌కు ప‌క్కా ఇన్ఫ‌ర్మేష‌న్‌తోనే రేవంత్‌రెడ్డి సైతం కేసీఆర్‌పై పార్టీలో తిరుగుబాటు త‌ప్ప‌దంటూ లీకులు ఇచ్చార‌ని చెబుతున్నారు. ఇంత‌కీ టీఆర్ఎస్‌లో అంత‌లా ఏం జ‌రుగుతోంది?

గ‌తంలో మైసూర్ రిసార్ట్‌లో కేటీఆర్‌పై నోరు పారేసుకున్న మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి ప‌ద‌వి ఊడుతుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఈట‌ల పుణ్యాన ఆయ‌న ప‌ద‌వి ప్ర‌స్తుతానికి ప‌దిలంగా ఉంది. తాజాగా, మంత్రి పువ్వాడ అజ‌య్ పోస్టుకు ఎస‌రు వ‌చ్చింద‌ని అంటున్నారు. హుజురాబాద్ గండం గ‌డిచాక‌.. కేబినెట్‌లో ఎవ‌రెవ‌రు ఉంటారో.. ఎవ‌రెవ‌రు ఊడుతారోన‌నే టెన్ష‌న్ మంత్రుల్లో క‌నిపిస్తోంది. 

తాజాగా, వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించే తెలంగాణ విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌కు ఏర్పాట్ల‌పై మంత్రి పువ్వాడ అజ‌య్‌తో సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఆ మీటింగ్‌ జ‌రిగిన తీరు.. భ‌విష్య‌త్ ప‌రిణామాల‌కు నిద‌ర్శ‌నం అంటున్నారు. బ‌స్సుల లెక్క‌ల‌పై సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించ‌డం.. పువ్వాడ స‌మాధానం చెప్ప‌లేక‌పోవ‌డం.. ఎన్ని బ‌స్సులు ఉన్నాయో కూడా తెలీదా? అంటూ కేటీఆర్ అవ‌మానించ‌డం.. తాను ఆర్టీసీ మంత్రిని కాద‌ని, ర‌వాణా శాఖ మంత్రినంటూ పువ్వాడ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వ‌డం.. ఇవ‌న్నీ కేసీఆర్ మంత్రిమండ‌లిలో లుక‌లుక‌ల‌ను బ‌య‌ట‌పెడుతున్నాయ‌ని అంటున్నారు. 

త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన తుమ్మ‌ల ఓట‌మితో ఖ‌మ్మం జిల్లా నుంచి పువ్వాడ అజ‌య్‌కు మంత్రిమండ‌లిలో చోటిచ్చారు కేసీఆర్‌. అస‌లు తుమ్మ‌ల ఓట‌మికి పువ్వాడనే కార‌ణ‌మ‌ని తెలిసినా.. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం కావ‌డంతో కేబినెట్‌లోకి తీసుకోక త‌ప్ప‌లేదు. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో ప‌లు ఎమ్మెల్సీ స్థానాల భ‌ర్తీ జ‌ర‌గ‌నుండ‌టంతో.. ఈసారి తుమ్మ‌ల‌ను ఎమ్మెల్సీని చేసి.. కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే పువ్వాడ పోస్ట్ ఊస్ట్ అవ‌క త‌ప్ప‌దు. ఈ విష‌యం తెలిసే.. పువ్వాడ సైతం మంత్రి కేటీఆర్‌కు అలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చార‌ని అంటున్నారు.

ఈట‌ల రాజేంద‌ర్ చెప్పిన‌ట్టు.. సీఎం కేసీఆర్ మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను అస్స‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం, ఏమాత్రం ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డంపై.. అపాయింట్‌మెంట్ సైతం ఇవ్వ‌క‌పోవ‌డంపై.. చాలా మంది పార్టీ నేత‌లు కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని అంటున్నారు. కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రి చేసే ప్ర‌య‌త్నం పార్టీలో చాలా మందికి ఇష్టం లేద‌ని తెలుస్తోంది. ఈట‌లలా వారంతా ప్ర‌స్తుతానికి రెబెల్ జెండా ఎగ‌రేయ‌క‌పోయినా.. స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నార‌ని చెబుతున్నారు. ఇలాంటి విష‌యాల‌ను ముందే ప‌సిగ‌ట్టే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత బ‌లం చేకూర్చుతున్నాయి. త్వ‌ర‌లోనే కేసీఆర్‌పై పార్టీలో తిరుగుబాటు త‌ప్ప‌దంటూ రేవంత్‌రెడ్డి చెప్ప‌డం వెనుక.. ఆ మేర‌కు ఆయ‌న ద‌గ్గ‌ర‌ న‌మ్మ‌ద‌గిన స‌మాచారం ఉంద‌ని అంటున్నారు. మ‌రి, ఆ తిరుగుబాటు హ‌రీష్‌రావు నాయ‌క‌త్వంలో వ‌స్తుందా? క‌విత లీడ‌ర్‌షిప్‌లో జ‌రుగుతుందా? లేక‌, ఎవ‌రికి వారే ఒక్క‌క్క‌రిగా ఈట‌ల త‌ర‌హాలో బ‌య‌ట‌కి వ‌చ్చేస్తారా? అనేది చూడాలి..