మాజీ మంత్రికి అర్ధరాత్రి నోటీసులా..! ఏపీలో ఇంత అరాచకమా.. 

ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి తొత్తులుగా మారి విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో చాలా ఆరోపణలు వచ్చినా, కోర్టులు మొట్టికాయలు వేసినా ఏపీ పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా మరోసారి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఇంటి దగ్గర పోలీసులు ఓవరాక్షన్ చేశారనే విమర్శలు వస్తున్నాయి. 

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబుకు నోటీసులు ఇవ్వటానికి గుంటూరులోని ఆయన ఇంటికి సోమవారం అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో పోలీసులు  వచ్చారు. ఈ సందర్భంలో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఆనందబాబు సోమవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వమే యువతను మాదక ద్రవ్యాలకు బానిస చేస్తుందని, చిత్తూరు జిల్లాలో మంత్రి అనుచరులే మాదక ద్రవ్యాల ముడి పదార్థాలు సాగుచేస్తున్నారని, రాష్ట్రం కేంద్రంగా సాగుతున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల ముడి పదార్థాల సాగుపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాలని మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో విశాఖపట్టణానికి చెందిన పోలీసులు దీనిపై వివరణ కోరుతూ అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో ఆయనకు నోటీసులు ఇవ్వటానికి వచ్చారు. దీనిపై ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి నిద్ర లేపాల్సిన  పని ఏముందని, ఉదయం ఇక్కడే ఉంటాం కదా! ఆ నోటీసు ఉదయం ఇవ్వవచ్చుకదా అని  ఆగ్రహం వ్యక్తం చేయడంలో పోలీసులకు ఆయనకు మధ్య  కాసేపు వాదోపవాదాలు జరిగాయి.దీంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. మాజీ మంత్రికి అర్దరాత్రి వందలాది మంది పోలీసులతో వచ్చి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.