రాంపుర చారిత్రక అన్నవాళ్లను కాపాడుకోవాలి
posted on Sep 20, 2024 9:10AM
పురావస్తు పరిశోధకులు డా.ఈమని శివనాగిరెడ్డి

కర్ణాటక లోని శ్రీరంగపట్నం తాలూకా, రాంపురలోని విజయనగర కాలం నాటి చారిత్రక ఆనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. రాంపుర గ్రామానికి చెందిన దేవత కృష్ణప్రసాద్ ఆహ్వానంపై ప్రముఖ వారసత్వ పరిరక్షణ ఆర్కిటెక్ట్ బోయపాటి శరత్ చంద్రతో కలిసి శుక్రవారం నాడు ఆయన రాంపూర చారిత్రక ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పచ్చటి పొలాల మధ్య సుందరతర కావేరి తీరంలో సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన రాంపూర లోని పురాతన దేవాలయాలను కాపాడుతున్న కృష్ణ ప్రసాద్ వాటి వివరాలను అందించారన్నారు.
కావేరీ తీరంలోని సుప్రసిద్ధ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం సమీప గ్రామమైన రాంపుర లో క్రీ.శ. 16వ శతాబ్దికి చెందిన మూడు వీరగల్లులు, ఒక సతికల్లు, 9 అడుగుల ఎత్తున్న వీరాంజనేయ, బాలాంజనేయ విగ్రహాలు, కావేరీ నదిలో బండరాళ్లకు చెక్కిన సిద్ధి వినాయక శిల్పం, శివలింగం, ఎదురుగా ప్రతిష్టించిన నంది విగ్రహం, విజయనగర కాలంలో గ్రామం ప్రముఖ స్థావరంగా వెలుగొందిందని తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు.
కావేరి నదిలోను, ఒడ్డున, ఆలయ నిర్మాణానికి, శిల్పాలు చెక్కడానికి కావలసిన రాతిని తీసిన క్వారీలను, రాతిని విడగొట్టడానికి గూటాలు దింపటానికి చెక్కిన ఆనవాళ్లను శివనాగిరెడ్డి గుర్తించారు. ఇంకా రామాయణ కాలపు గౌతమ మహర్షి నివాస స్థావరం, స్నాన ఘట్టాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, శ్రీరంగపట్నం పర్యాటకులను రాంపూర కు రప్పించవచ్చని ఆయన అన్నారు. ఇప్పటికి చెక్కుచెదరని వందేళ్ల నాటి ఇళ్లకు కొద్దిపాటి మరమ్మతులు చేసి, ఆతిథ్య రంగంలో స్థానికులకు శిక్షణ ఇచ్చి, పెయింగ్ గెస్ట్ ఎకామిడేషన్ సౌకర్యం కల్పించి, రాంపురను, వారసత్వ, తీర్థయాత్ర, గ్రామీణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని శరత్చంద్ర అన్నారు.