నాసా రాకెట్.. శకలాలు తాకొద్దు...

 

రోదసీలో వున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు నాసా ప్రయోగించిన మానవ రహితనౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్‌ నాసా ప్రయోగించిన కొద్ది క్షణాల్లోనే పేలిపోయింది. ఇది ‘ద ఆర్బిటల్‌ సైన్సెస్‌ కార్పొరేషన్‌’కు చెందిన అంటారెస్‌ రాకెట్‌. వర్జీనియాలోని వాలప్స్‌ దీవి నుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు ప్రయోగించగా గాల్లోకి ఎగిరిన 6 సెకన్లలోనే రాకెట్‌ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు వల్ల భారీగా నష్టం సంభవించింది. అయితే ఈ పేలుడు కారణంగా ప్రాణనష్టం సంభవించకపోవడం, ఎవరికీ గాయాలు కాకపోవడం ఊరట కలిగించే విషయమని నాసా వెల్లడించింది. రాకెట్‌ ఇలా గాల్లోనే పేలిపోవడానికి కారణాలపై నాసా నిపుణులు పరిశోధస్తున్నారు. ఇదిలా వుంటే,  గాల్లో పేలిపోయిన రాకెట్‌ శకలాలు ఎవరికైనా కనపడితే వాటిని తాకడం ప్రమాదకరమని ఆర్బిటల్‌ సైన్సెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్రాంక్‌ కల్బర్‌స్టన్‌ వర్జీనియా ప్రాంత ప్రజలకు సూచించారు.