మోడీ పధకాలకు మెరుగులు దిద్దుతున్న చంద్రబాబు

 

గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చగా, ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో కళకళలాడుతుంటేనే దేశం కూడా కళకళలాడుతుంటుందని మహాత్మా గాంధీజీ ఏనాడో చెప్పారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీయే పాలించినప్పటికీ, ఆ పార్టీ ఆయన పేరును వాడుకొందే తప్ప ఆయన చెప్పిన ఈ మంచి సలహాను ఎన్నడూ చెవికెక్కించుకోలేదు. అందుకే నేటికీ దేశంలో లక్షలాది గ్రామాలలో దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

 

ప్రధాని మోడీ సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నప్పటికీ, గాంధీ మహాత్ముడు సూచించిన విధంగా ‘స్వచ్చ భారత్’ కార్యక్రమాన్ని, ఆ తరువాత ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పధకాన్ని’ ప్రవేశపెట్టారు. పార్లమెంటు సభ్యులు అందరూ తమ తమ నియోజక వర్గాలలో ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రధాని ఇచ్చిన పిలుపుకి పార్టీలకతీతంగా సోనియా, రాహుల్ గాంధీలతో సహా చాలా మంది యంపీలు, కేంద్రమంత్రులు స్పందించారు.

 

చాలా ఏళ్లుగా ప్రతీ యంపీకి రూ.2 కోట్లు చొప్పున స్థానిక అభివృద్ధి నిధులను కేంద్రప్రభుత్వం మంజూరు చేస్తోంది. దానిని యంపీలు స్థానిక అవసరాలను బట్టి ఖర్చు చేసే అధికారం కలిగి ఉన్నారు. అది పూర్తిగా వారి విచక్షనాధికారాలకు లోబడే జరుగుతుంది కనుక చాలా మంది దానిని దుర్వినియోగం చేయడమో లేకపోతే అసలు స్థానిక అభివృద్ధికి ఖర్చు చేయకపోవడం వలన ఆ నిధులు మురిగిపోవడమో జరుగుతుంటుంది. అది గమనించే మోడీ ఈ పధకం ఆరంభించారు. తద్వారా ఆ నిధులతో యంపీలు తమ నియోజక వర్గాలలో ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ఆయన ఆశిస్తున్నారు.

 

అయితే కేంద్ర ప్రభుత్వమే వారికి తగిన నిధులు అందజేసి ఏదో ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయమని కోరినప్పటికీ ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో అనేకమంది యంపీలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొనేందుకు ఇష్టపడటం లేదు. ఎవరి సాకులు, సమస్యలు వారికున్నాయి.

 

మోడీ ప్రవేశపెట్టిన ఈ పధకం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బాగా ఆకర్షించింది. ప్రధాని మోడీ ఇచ్చిన స్పూర్తితో ఆయన ‘స్మార్ట్ విలేజ్, స్మార్ట్ ఆంద్రప్రదేశ్’ అనే ఒక పధకం ప్రవేశపెట్టారు. మోడీ తన పధకంలో కేవలం యంపీలను మాత్రమే భాగస్వాములు చేస్తే చంద్రబాబు దానిని మరింత విస్త్రుతపరిచి పరుస్తూ అందులో రాష్ట్ర మంత్రులు, యం.యల్యే.లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కార్పోరేట్ సంస్థలు, స్వచ్చంద సంస్థలను ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని రాష్ట్రంలో గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి విద్యుత్ స్వచ్చమయిన నీళ్ళు, రోడ్లు, కాలువలు, కళాశాలలు, ప్రాధమిక ఆసుపత్రులు వంటి మౌలికవసతులు ఏర్పాటు చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయాలని ఆయన ప్రయత్నించడం చాలా మంచి ఆలోచన. అభినందనీయం కూడా.

 

అయితే స్వయంగా ప్రధాని మోడీ కోరినా కొందరు యంపీలు స్పందించకపోవడం గమనిస్తే, చంద్రబాబు పిలుపుకి కూడా అటువంటి మిశ్రమ స్పందనే రావచ్చును. కనుక గ్రామాలను దత్తత తీసుకొన్నవారికి ఆయన కొన్ని ప్రోత్సహకాలు, రాయితీలు ప్రకటిస్తే బహుశః మంచి స్పందన రావచ్చును. రాష్ట్రాభివృద్ధిలో అందరూ పాలుపంచుకోవలసిందిగా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల కూడా మంచి ఫలితం కనబడవచ్చును.

 

తెలంగాణా ప్రభుత్వం ఆ రాష్ట్రంలో చెరువుల పునరుద్దరణకు కూడా ఇటువంటి ప్రయోగమే చేస్తోంది. దేశ విదేశాలలో ఉన్న తెలంగాణావాసులు తమతమ ప్రాంతాలలో చెరువుల అభివృద్ధిలో పాలుపంచుకొనేందుకు ప్రోత్సహిస్తోంది.మూడు చెరువులను దత్తత తీసుకొన్నవారికి వారు కోరుకొన్నవారి పేర్లను పెట్టేందుకు సిద్దమని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇటువంటి వినూత్నమయిన ఆలోచనలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయగలిగితే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా, ప్రభుత్వంపై కూడా ఆర్ధికభారం పడదు.