స్వంత పార్టీకే ఎసరు పెట్టుకొంటున్న జననేత

 

ఆంద్రప్రదేశ్ శాసనసభలో నిన్నరాజధాని అభివృద్ధి మండలి బిల్లు పేరిట అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, చివరికి తిట్లు తోపులాటల వరకు సభలో జరగకూడనివన్నీజరిగాయి కానీ బిల్లుపై లోతుగా చర్చ మాత్రం జరుగకుండానే ఆమోదం ముద్ర పడింది. అందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డినే నిందించక తప్పదు. ఎందుకంటే ఇదివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ వద్ద రాజధాని నిర్మిస్తానని సభలో ప్రకటించినప్పుడు దానిని ఆయన స్వాగతించారు. కానీ ఆయన ఇప్పుడు చెపుతున్నట్లుగా రాజధానిని దొనకొండ లేదా వినుకొండ వద్ద పెట్టుకోమని ఆనాడు సూచించలేదు. ఆ తరువాత తూళ్ళూరులో రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి భూసేకరణకు సిద్దమవుతున్నప్పుడు, కృష్ణా జిల్లాలో బలహీనంగా ఉన్న తన వైకాపాను బలోపేతం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సున్నితమయిన ఈ అంశంపై కూడా రాజకీయాలు చేస్తూ భూసేకరణలో ప్రభుత్వానికి ఎన్ని ఆటంకాలు సృష్టించవచ్చో అన్నీ సృష్టించారు.

 

ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందంటూ సభలో చాలా రాద్దాంతం చేసిన జగన్, బిల్లుపై లోతుగా చర్చించి, అందులో లోటుపాట్లు ఏమయినా ఉంటే సరిచేసేందుకు ప్రయత్నించకపోగా, తనకు అధికారం దక్కనీయకుండా చేసారనే దుగ్ధతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిందించడానికే ప్రాధాన్యం ఇవ్వడం చాలా దురదృష్టకరం. అసలు బిల్లులో లోపాలపై చర్చించకుండా, రాజధానిపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేయకుండా బిల్లును ఎందుకు వ్యతికించారంటే, భూములు పోగొట్టుకొంటున్న రైతుల సానుభూతి పొంది తద్వారా జిల్లాలో తన పార్టీని బలోపేతం చేసుకోవడానికే తప్ప వేరే ఏ ప్రయోజనం కనబడటం లేదు.

 

అయితే ఆయన ఆ ప్రయత్నమూ దైర్యంగా చేయలేకపోయారనే చెప్పవచ్చును. ఎందుకంటే చంద్రబాబు నాయుడు “ఆ ప్రాంతంలో రాజధాని నిర్మించడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా?” అని అడిగిన ప్రశ్నకు ఆయన అవునని కానీ కాదని గానీ సూటిగా జవాబు చెప్పలేకపోయారు. కానీ ప్రభుత్వం రైతులను అన్యాయం చేస్తోందంటూ పదేపదే సభలో నొక్కి చెప్పారు. రైతులకు న్యాయం జరగాలంటే బిల్లులో తను గమనించిన లోపాలను వివరించి దానిపై సభలో చర్చించి వాటిని సవరించేందుకు గట్టిగా కృషిచేయడం ప్రతిపక్ష నాయకుడి బాధ్యత. కానీ ఆ సాకుతో అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రజల దృష్టిలో దోషిగా నిలబెడుదామని ప్రయత్నాలు చేసి చివరకు ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక తనే దోషిగా మిగిలారు.

 

జగన్మోహన్ రెడ్డి తన పార్టీ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం చేస్తున్న ఇటువంటి ప్రయత్నాల వలననే ఆ పార్టీ మరింత దెబ్బ తినే ప్రమాదం ఉందని గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన జిల్లాలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు రాజధాని నిర్మాణానికి ఈవిధంగా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తే అక్కడ పార్టీ బలపడుతుందో లేదో తెలియదు కానీ మిగిలిన అన్ని జిల్లాలలో వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. రాజధాని నిర్మాణానికి ఆయన అడ్డుపడుతుండటం చూస్తున్న రాష్ట్ర ప్రజలు ఆయనపై చాలా ఆగ్రహంతో ఉన్నారు. అయితే పిల్లి మెడలో గంట ఎవరు కడతారనట్లు ఈ విషయాన్ని ఆయన చెవిలో వేసేందుకు వైకాపా నేతలు వెనుకాడుతున్నారు. అందువల్ల ఆయన తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ వితండవాదం చేస్తూ పార్టీకి శల్య సారధ్యం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ల సలహా సంప్రదింపులు చేయకుండా ఆయన తనకు తోచినట్లుగా పార్టీని నడిపించుకొంటూ పోతున్నారు. ఆ విధంగా వ్యవహరించడం వలననే  ఆయనను నమ్ముకొన్న తెలంగాణాలో పార్టీ నేతలు ఇంతకు ముందు రోడ్డున పడ్డారు. ఆంధ్రాలో వైకాపా నేతలకు కూడా మున్ముందు అదే పరిస్థితి ఎదురయినా ఆశ్చర్యం లేదు.