పాఠశాలలో గురువుల కోట్లాట.. వీడియో తీసిన శిష్యులు!

విద్యార్థులకు సత్ప్రవర్తన అలవర్చాల్సిన ఉపాధ్యాయులే వీధి రౌడీల్లా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటే.. అదీ విద్యార్థుల ముందే.. వారికి ఉపాధ్యాయులుగా కొనసాగే నైతికత ఉందా అంటూ నెటిజన్లు తెగ ఫైరైపోతున్నారు.

అసలేం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్ లోని మహేంగు ఖేరా గ్రామంలోని ఓ పాఠశాలలో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తన బూటు తీసి ఒక ఉపాధ్యాయురాలిని కొట్టారు. ఆ ఉపాధ్యాయురాలూ ఊరుకోలేదు. ప్రిన్సిపాల్ పై తిరగబడింది. తోటి ఉపాధ్యాయుులు ఎంత సముదాయించి వారి మధ్య ఘర్షణను నివారిద్దామని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పాఠశాలలోనే జరిగిన ఈ గొడవను విద్యార్థులు తమ ఫోన్ లో చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పెట్టారు. ఆ వీడియో వైరల్ అయ్యింది.

ఇంతకీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలి మధ్య గొడవ ఎందుకంటే.. ఉపాధ్యాయురాలు పాఠశాలకు ఆలస్యంగా వచ్చారు. ప్రిన్సిపాల్ కోపగించారు. ఆమె సమాధానంతో మరింత రెచ్చిపోయి బూటు తీసుకుకోట్టారు. దీంతో ఉపధ్యాయురాలూ తిరగబడ్డారు. ఇదీ సంగతి. అక్కడితో ఆ గొడవ ఆగిపోలేదు. ఇరువురూ ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు  చేసుకున్నారు.

ఉపాధ్యాయురాలు ప్రతి రోజూ పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారనీ, అదేంటని అడిగిన తనను దుర్భాషలాడినందుకే కోపంతో దాడి చేశాననీ ప్రిన్సిపాల్ చెబుతున్నారు. ఉపాధ్యాయురాలిపై బూటుతో దాడి చేసినందుకు ప్రిన్సిపాల్ ను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు.