కోనసీమ జిల్లా కాదు.. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా.. పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం

కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఏపీ సర్కార్ నిర్ణయం తీసేసుకుంది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీ  కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అమలాపురం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అయితే ఈ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న వినతుల నేపథ్యంలో పేరు మార్పునకు నిర్ణయం తీసుకుంది.

దీనిని వ్యతిరేకిస్తూ.. కోనసీమ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అమలాపురంలో ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. గత నెల 24న అమలాపురం పట్టణంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ నివాసాలను ఆందోళనకారులు ధగ్ధం చేశారు. పోలీసు వాహనాలు సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు అమలాపురం పట్టణంలో ఆంక్షలు విధించారు. పక్షం రోజుల పాటు అంతర్జాల సర్వీసులను నిలిపివేశారు. ఈ అల్లర్ల వెనుక విపక్షాల హస్తం ఉందంటూ ప్రభుత్వం విమర్శలు గుప్పించింది.

అయితే వాస్తవానికి అల్లర్ల కుట్ర అధికార పార్టీదేనంటూ విపక్షాలు ఫొటోలతో సహా వివరాలను బయటపెట్టారు. దీంతో సర్కార్ డిఫెన్స్ లో పడింది. ఈ అల్లర్లకు సంబంధించి అరెస్టయిన వారిలో అత్యధికులు వైసీపీకి చెందిన వారే కావడంతో కుట్ర పూరితంగా విధ్వంసం సృష్టించింది వైసీపీయేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా.. కోనసీమ జిల్లా పేరు మార్పునకు అభ్యంతరాలు తెలియజేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో పేరు మార్పుపై చర్చింది..

కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదలా ఉండగా,   కోనసీమ కు ఇప్పుడున్న పేరే కొనసాగించాలని, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో   పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి పైన కోర్టు విచారించాల్సి ఉంది.  మొత్తం మీద కోనసీమలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోనసీమ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది.