పవన్ కళ్యాణ్ సభ ఇందుకేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.... ఈ పేరు చెబితే సినిమా ఇండస్ట్రీకి పులకరింత వస్తుంది! కాని, ఇప్పుడు రాజకీయ రంగం కూడా పలవరింత చేస్తోంది పవన్ పేరు చెబుతూ! అందుక్కారణం తిరుపతి సభ!

 


పవన్ చనిపోయిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించటానికి తిరుపతి వెళ్లారు. కాని, అక్కడే మూడు రోజులుగా వుంటూ ఇవాళ్ల బహిరంగ సభ అంటున్నారు! అది కూడా ఎనిమిదేళ్ల కింద సేమ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తొలి సభ పెట్టిన రోజునే! ఏంటి దీని వెనుక ఆంతర్యం? ఇప్పడు తెలుగు నేలపైన అందరి మదిలో ఇదే ప్రశ్న! 

 

పవన్ హఠాత్తుగా సభ పెట్టటానికి కారణం ఏంటి? ఎప్పుడో 2019 సంవత్సరానికి ముందు యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తాడని అంతా అనుకుంటే ఇప్పుడే, ఈ సభతోనే జనం మధ్యలోకి జనసేనాని దూకేస్తారా? కమిటైన సినిమాలు అసలు చేస్తారా? చేయరా?  కేవలం వినోద్ రాయల్ అనే అభిమాని హత్యకి గురైనందుకు ఇంత పెద్ద సభ అక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టినా సరిపోయేది. కాని, పవన్ తన కోసం ఫ్యాన్స్ పడుతున్న ఆరాటం చూసి బాగానే చలించిపోయినట్టు వున్నారు. అందుకే, ఈ సభ పెట్టాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంత హఠాత్తుగా సభ పెట్టాలని మరే ఇతర రాజకీయ నాయకుడు అనుకున్నా కష్టమే అయ్యేది. కాని, పవన్ ఫాలోయింగ్ కారణంగా జనం సమకూరటం పెద్ద ఇబ్బందేం కాదు. అయితే, అసలు ప్రశ్న వచ్చిన  ఫ్యాన్స్ కి పవన్ ఏం చెబుతాడు? 

 


అభిమానులు మిగతా హీరోల ఫ్యాన్స్ తో సఖ్యంగా వుండాలి, హీరోల మధ్య ఎలాంటి గొడవలు వుండవు, మేమంతా ఒక్కటే లాంటి మాటలు ఎలాగూ వుంటాయి. కాని, ప్రత్యేక హోదా కోసం నానా రభస జరుగుతున్న తరుణంలో ఈ సభలో పవన్ దాని గురించి ఖచ్చితంగా ఏదోఒకటి మాట్లాడే ఛాన్స్ వుంది. అలాగే, ఇక మీద తాను ఫుల్ టైం ప్రశ్నించే పనిలో వుంటానని ఆయన అంటే మాత్రం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారే అవకాశం వుంది. పవన్ పని కట్టుకుని పూర్తిగా రాజకీయాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తే అధికార తెలుగు దేశంకు కొంచెం కష్టమే.

 

ఇంతకాలం జగన్ ప్రతిపక్ష నేతగా పెద్దగా టీడీపిని ఇబ్బంది పెట్టిందేం లేదు. అలాగే, పవన్ ప్రతిపక్ష పాత్ర పోషించటం మొదలుపెడితే వైసీపీ అధినేత జగన్ కు కష్టకాలమనే చెప్పాలి. ఆయనకున్న ప్రతిపక్ష నేత హోదా కూడా అనుమానంలో పడుతుంది. ఆయన వద్ద అతి కష్టంగా కాలం గడుపుతున్న నేతలంతా జనసేన కొత్త ఆఫీసుకి బయలుదేరే ఛాన్స్ లేకపోలేదు!

 


ఇక ఢిల్లీలో అధికారంలో వుండి ప్రత్యేక హోదా పై ఫుల్ డ్రామా నడుపుతున్న బీజేపికి కూడా పవన్ ఎంట్రీ ఇబ్బంది కలిగించే అవకాశాలే ఎక్కువ! పవన్ ప్రత్యేక హోదా అంటూ జనంలోకి వెళితే అది ఇవ్వక తప్పని అనివార్య స్థితిలోకి మోదీ ప్రభుత్వం వెళుతుంది. అప్పుడేం చేస్తారో చూడాలి!

 


బీజేపి, టీడీపీ, వైసీపీ... ఇలా అన్ని ప్రధాన పార్టీలకి పెద్ద కొశన్ మార్క్ గా మారిపోయిన పవన్ బహిరంగ సభ .... ముగిస్తే గాని పవర్ స్టార మనసులో ఏముందో తెలియదు! కాకపోతే, ఈ సభతో పుష్కరాల హడావిడి ముగిసి రాజకీయ పుష్కరాల హంగామా మొదలవుతుంది! కృష్ణలో గురువు ప్రవేశించినట్టు... ఆంద్ర రాజకీయ కృష్ణా నదిలో పవన్ ప్రవేశిస్తాడేమో!