జనం… జగన్ కంటే పవన్‌ని ఎక్కువగా నమ్ముతున్నారా?

ఏపీలో జనానికి ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పుకుంటారు? వీలైతే చంద్రబాబుకు మొరపెట్టుకుంటారు! అధికార పక్షం వల్ల పని జరగదని జనం భావిస్తే ప్రతిపక్ష నేతని ఆశ్రయిస్తారు! కాని, ఇప్పుడు తెలుగు ప్రజలకి మరో ఆప్షన్ కూడా లభించింది! అదే జనసేన! జనం ఇప్పుడు జనసేనాని పవన్ వైపు కూడా చూస్తున్నారు ఏదైనా కష్టం వస్తే! ఇన్ ఫ్యాక్ట్, జగన్ కంటే ఎక్కువగా పవన్ని నమ్ముతున్నట్టుగా వుంది వ్యవహారం!

 

ఆంధ్ర రాష్ట్ర అంసెబ్లీలో టీడీపీ, బీజేపి కాకుండా వున్నది వైసీపీ మాత్రమే! అదే ఏకైక ప్రతిపక్షం, విపక్షం అన్నీ కూడా! కాని, వైసీపీ అధినేత జగన్ ఒకప్పటిలా ఇప్పుడు జనంలో వుండటం లేదు. వున్నా ఒకటి రెండు రోజులు పరామర్శలు, ఓదార్పులతో పని కానిచ్చేస్తున్నాడు. అంతే కాదు, ఆయన జనం తరుఫున గట్టిగా మాట్లాడినా కూడా ప్రభుత్వం విన్నది, భయపడ్డది ఎంత మాత్రం వుండటం లేదు. అమరావతి రైతుల కష్టాలు మొదలు టెన్త్ విద్యార్థుల పేపర్ లీకేజీ ఇబ్బందుల వరకూ జగన్ ఎన్నో అంశాలు ప్రస్తావించినా ఏం సర్కార్ వెనక్కి తగ్గిన సందర్భాలు పెద్దగా కనిపించవు! సభ లోపలా, బయటా కూడా ఇదే పరిస్థితి!

 

జగన్ వెనుక పెద్ద పార్టీ, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేత హోదా… ఇన్నీ వున్నా జనం ఆయనతో సమానమైన ప్రాధాన్యాన్ని పవన్ కు ఇస్తున్నట్టు కనిపిస్తోంది! ఇలా వచ్చి జనంలో కలిసి, వారితో మాట్లాడి, సమస్యల గురించి గొంతుక వినిపించి మళ్లీ షూటింగ్ కి వెళ్లిపోతుంటాడు కాటమరాయుడు. ఒక్కసారి సెట్స్ మీద హడావిడి మొదలైందా… ఆయన ఆరోపణలన్నీ ట్విట్టర్ కే పరిమితం! అయినా కూడా పవన్ అడపాదడపా వచ్చి వెళుతోంటే జనం ఆవురావురుమని గోడు వెల్లబోసుకుంటున్నారు. తాజాగా అగ్రి గోల్డ్ బాధితులు పవన్ ఆశ్రయించిన వారి లిస్ట్ లో చేరారు! పవర్ స్టార్ జోక్యంతో వారికి ఎంత వరకూ లాభం కలుగుతుంది అన్నది మనం చెప్పలేం. కాని, వారైతే పూర్తి విశ్వాసంతో గబ్బర్ సింగ్ దర్భార్ కి హాజరయ్యారు!

 

ప్రజ సమస్యలపై ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ అన్నంత పని చేస్తూనే వున్నాడు. అయితే, ఇప్పటికి మాత్రం పార్ట్ టైంగా ప్రశ్నిస్తున్నాడు. దాని వల్ల జనానికి అద్బుతమైన మేలైతే జరగలేదు. రైతులు మొదలు అగ్రి గోల్డ్ బాధితుల దాకా ఎవ్వరికీ పవన్ వల్లే కష్టాలు తీరాయని చెప్పటానికి వీలు లేని పరిస్థితి. కాని, జనం మాత్రం జనసేనాని ముందు తమ ఇబ్బందులు చెప్పుకోటానికి ఆశతో ముందుకు వస్తున్నారు! ఈ ట్రెండ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి నష్టం కలిగించవచ్చు! పవన్ కు సీట్లు సాధించి పెట్టవచ్చు! అన్నిటి కంటే ముఖ్యంగా జగన్ కు తీవ్రమైన నష్టం తీసుకురావచ్చు! ప్రతిపక్ష నేతగా ఆయనని నమ్ముకోవాల్సిన జనం… పవన్ వెంట వెళ్లిపోతే… సీఎం కుర్చీ మళ్లీ మరింత దూరంగా వెళ్లిపోతుంది!