శ్రీవారికి పోస్కో 10 కోట్లు.. దేవుడిపై భక్తా?ఆంధ్రులకు బిస్కెట్టా?

పోస్కో. సౌత్ కొరియన్ కంపెనీ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో పోస్కో పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పోస్కో పేరు వినిపిస్తేనే మండిపడుతున్నారు జనాలు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కొల్లగొట్టే కంపెనీగా పోస్కోపై ఆగ్రహం పెంచుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ తో పాటు పోస్కోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. 

కొరియన్ కంపెనీకి సడెన్ గా మన తిరుమల వెంకన్న మీద భక్తి పుట్టుకొచ్చింది. శ్రీవారికి భారీ విరాళం ఇచ్చింది. శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో 10 కోట్లు విరాళం అందజేసింది. పోస్కో సంస్థ సీఈవో సంజయ్ పాసి డొనేషన్ కు సంబంధించిన డీడీలను టీటీడీకి అందజేశారు. 

పోస్కో కంపెనీ టీటీడీకి భారీ విరాళం ఇవ్వడంపై జనాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. దేవుడికి ఇచ్చిన దానాన్ని ఎవరూ తప్పు బట్టక పోయినా.. సమయం, సందర్భం చర్చకు కారణమవుతోంది. గతంలో ఎన్నడూ లేనిది సడెన్ గా ఇప్పుడే పోస్కో ఈ పని చేయడం ఆసక్తికరంగా మారింది. ఓవైపు పోస్కోకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో పోస్కో సంస్థ శ్రీవారికి 10 కోట్ల భూరీ విరాళం ఇవ్వడం వెనుక కేవలం భక్తి భావమే ఉందా? మరి, ఇంకేదైనా యుక్తి దాగుందా? అంటూ భక్తులు చర్చించుకుంటున్నారు.