విశాఖ ఉక్కుకు మావోయిస్టుల మద్దతు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృమవుతోంది. కేంద్ర సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఉక్కు కర్మాగారం కార్మికులు చేస్తున్న పోరాటానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఏపీలోని ప్రధాన పార్టీలన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రోడ్డెక్కాయి. వామపక్షాలు కార్మికులతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి మావోయిస్టులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ మేరకు మావోయిస్ట్  ఏవోబీ జోనల్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో లేఖ విడుదలైంది. ఉక్కు పరిశ్రమని అందరం ఐక్యంగా ఉద్యమించి కాపాడుకుంటేనే 32మంది త్యాగానికి నివాళి తెలిపారు. బీజేపీ, వైసీపీ వేరైనప్పటికి.. వారు అమలు చేసే విధానాలు మాత్రం ఒక్కటే అంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. 

ఉక్కు కర్మాగారానికి విశాఖలో 22వేల ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సగం మేర కర్మాగార నిర్మాణం ఉంది. మిగతా సగం ఖాళీ భూముల్లో విశాఖ ఉక్కు కంపెనీకి పోటీగా మరో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు దక్షిణ కొరియాకు  చెందిన పోస్కో కంపెనీ ముందుకొచ్చింది. అందుకు  కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విడ్డూరం. 2019 అక్టోబర్ లో పోస్కో- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 2019 మే 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 21న సీఎం జగన్మోహన్ రెడ్డిని పోస్కో ప్రతినిధులు కలిసినట్టువార్తలొచ్చాయి. దీంతో సీఎం జగన్ డైరెక్షన్ లోనే ఢిల్లీ స్థాయిలో పావులు కదిలాయని అంటున్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో చూస్తోంది కేంద్రం. కుక్కను చంపాలంటే ముందుగా దాని మీద పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలంటారు. అప్పుడిక పని మరింత సులువవుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ అదే జరుగుతోంది. 2019 నాటికి 95 కోట్ల లాభంతో నడుస్తోంది RINL. కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా ఉక్కుకు డిమాండ్ తగ్గింది. ఆ ప్రభావం విశాఖ స్టీల్ మీదా పడింది. అన్ని కంపెనీల మాదిరే దీనికీ నష్టాలు తప్పలేదు. ఇది సాకుగా చూపించి మొత్తానికి మొత్తం గంప గుత్తగా అమ్మేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్ లో కేంద్రం వంద శాతం ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుందని అంటున్నారు.