హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్
posted on Mar 5, 2025 11:26AM
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేశ్ లపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కర్నూలు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. పోసానిపై ఎపిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదయ్యాయి. టిడిపి, జనసేన అభిమానులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసులు నమోదవుతున్నాయి. గత నెల హైద్రాబాద్ లో అరెస్టైన పోసానిని ఓబులాపురం పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. నరసారావుపేట పోలీసులు పీటీ వారెంట్ తీసుకుని రిమాండ్ లో ఉన్న పోసానిని అదుపులోకి తీసుకుని గుంటూరు సబ్ జైలుకు తరలించారు. అక్కడ నుంచి ఆదోని పోలీసులు పీటీ వారెంట్ తీసుకుని అదుపులోకి తీసుకుని కర్నూలు సబ్ జైలుకు తరలించారు. అక్కడ ఈ నెల 18 వరకు రిమాండ్ లో ఉంటారు.వైకాపా అధికారంలో ఉన్నప్పుడు పోసాని కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆయనపై కేసులు నమోదు కాలేదు. కూటమి అధికారంలో రాగానే పోసాని వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తనను ఎపి పోలీసులు అరెస్ట్ చేయకుండా నిలువరించాలని పోసాని హైకోర్టు నాశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పోసాని క్వాష్ పిటిషన్ వేశారు.