రాని ‘కోచ్’ కోసం కుమ్ములాటలు 

ఐటీఐఆర్, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఈరెండు అంశాలు ఇప్పుడు రాష్ట్ర్ర రాజకీయాలలో,   మరీ రెండు పట్టభద్రుల నియోజక వర్గాలకు జరుగతున్నఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.రాజకీయంగా కాకా పుట్టిస్తున్నాయి.సవాళ్ళు ప్రతి సవాళ్లు ఎగిరెగిరి పడుతున్నాయి. అయితే,ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు ఓటములు ఈ సమస్యలకు పరిష్కారం చూపుతాయని, మెడ మీద తలకాయ ఉన్న ఎవరూ అనుకోరు. 

సహజంగా ఎమ్మెల్సీఎన్నికల్లో పట్టభద్రులు, ప్రభుత్వఉద్యోగులు,ఉపాధ్యాయులు,నిరుద్యోగులు,వారి సమస్యలు, పరిష్కారాలు మరీ ముఖ్యంగా నిరుద్యోగం, వంటి అంశాలు కాదంటే స్థానిక ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు ప్రధానంగా చర్చకు వస్తాయి. కానీ ప్రధాన సమస్యలు పక్కకు పోయి,దశాబ్దాలుగా ముడిపడని ఐటీఐఆర్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, విభజన చట్టంలో అమలు కానీ అంశాల మీద రాజకీయ పార్టీలు అన్నీ ఫోకస్’ పెట్టాయి.ఇది కల్వకుట్ల చాణక్యం, కాదంటే ప్రతిపక్షల వ్యుహత్మక అమాయకత్వం తప్ప మాటొకటి కాదు. 

ప్రస్తుతం ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల మీద దృష్టి పెడితే ఏమి జరుగుతుందో, ఉద్యోగ నియామకాల విషయంలోనే తేలి పోయింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, గొప్పగా లెక్కలు చెప్పబోయి బొక్కబోర్లా పడ్డారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, పీఅర్సీ చైర్మన్ బిస్వాల్, మంత్రి కేటీఆర్ బడాయి లెక్కల గాలి తీశారు.మంత్రి గారి లెక్క తప్పని చెప్పి ప్రతిపక్షాల చేతికి చక్కని అస్త్రాన్ని అందించారు. దీంతో అప్పటికే లెక్కలతో సిద్ధంగా ఉన్న ప్రత్యర్ధులు ఒకరి వెంట ఒకరు సవాలు చేయడంతో మంత్రి కేటీఆర్’తో తెరాస నాయకులు, అభ్యర్ధులు ఇరకాటకంలో పడ్డారు. పలాయనం చిత్తగించక తప్పలేదు.

అందుకే కేటీఆర్, తెలంగాణ ఉద్యమ మూల స్థంభాల్లో ఒకటైన నియమకాల నుంచి ఓటర్ల దృషిని మరల్చేందుకు, సెంటిమెంట్’ శరణు వేడారు.ఎప్పుడోనే ములన పడేసిన ఐటీఐఆర్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశాలకు సెంటిమెంట్ తాలింపులు చేర్చి తెరమీదకు తెచ్చారు. నిజానికి ఈ రెండు అంశాలు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా లాగా ముగిసిన అధ్యాయాలు. ఐటీఐఆర్  విషయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది.ఒక్క తెలంగాణకు మాత్రమే కాదు, దేశం మొత్తంలో ఐటీఐఆర్ ప్రాజెక్టులు అన్నిటిని రద్దు చేసింది. 

ఇక ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయం అయితే అదొక అంతు లేని కధ, ఇంచుమించుగా అర్థ శతాబ్దంపైగా అలా నడుస్తూనే ఉంది. నలభై ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.అదే కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రాజెక్టును పంజాబ్’కు పట్టుకు పోయింది. మళ్ళీ 2010 లో మమత బెనర్జీ కేంద్ర రైల్వే మంత్రిగా రోజుల్లో కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా కోచ్ మరమత్తుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.అదీ జరగ లేదు.రాష్ట విభజన సమయంలో మళ్ళీ కోచ్ ఫ్యాక్టరీ  అంశం తెరమీదకు వచ్చింది. విభజన  చట్టంలో చేర్చారు. అది కూడా ఆరే ఆరు నెలల్లో ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతాయని చట్టంలో పేర్కొనారు. ఏమి జరిగిందో తెలియంది కాదు. అంతే కాదు, ఎవరో ఒక సామాన్య పౌరుడు సమాచార హక్కు చట్టం పరిధిలో ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎంతవరకు వచ్చిందని అడిగిన ప్రశ్నకు, రైల్వే శాఖ ప్రస్తుతానికి ఖాజీపేట సహా దేశంలో ఎక్కడా కొత్తగ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఇది అందరికి తెలిసిన విషయం. ఇది జరిగి కూడా ఆరేడు నెలలు అయింది. అయినా ఇంతవరకు అదేమిటని,పబ్లిక్’గా కేసీఆర్ అడగలేదు, కీటీఆర్ కేంద్రాన్ని క్వశ్చన్ చేయలేదు. ఇప్పడు ఇలా హటాత్తుగా ఎన్నికల వేదిక ఎక్కించారు. 

ఇప్పుడు ఆ ముక్కను పట్టుకుని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, తెరాస, బీజేపీ,కాంగ్రెస్ నిరుద్యోగ యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయులు, ప్రైవేటు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒకరని కాదు, యావత్ ఉద్యోగ కార్మిక వర్గం ఎదుర్కుంటున్న సమస్యలు పకకు నెట్టి, ఎప్పటికీ  ముడి పడని, అంశాల చుట్టూ తిరుగుతున్నారు.  

ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో పెరుగతున్న అసంతృప్తిని గుర్తించి  ప్రభుత్వ వైఫలయ్యాలను కప్పి పుచ్చుకునేందుకు అధికార పార్టీ రియల్ ఇష్యూస్ నుంచి ఓటర్లను పక్కకు తీసుకుపోయేందుకు అడ్డగోలు అంశాలను తెరమీదకు తెచ్చిందంటే అర్థం చేసుకోవచ్చును.కానీ,ప్రతి పక్షాలు ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకూడా తెరాస ట్రాప్’లో పడడం ఎమిటో అర్ధం కాదు. ట్రాప్’లో పడిందా లేక ఇంకా పాత బంధాలు పనిచేస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
నిజంగా, ఐటీఐఆర్ కానీ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, నిజంగా ముడి పడాలంటే, ఇక్కడ కేటీఆర్ నృత్యం చేస్తే పయోజనం ఉండదు, దమ్ముటే, పార్లమెంట్’లో కేంద్రాన్ని, ప్రధాని మోదీనీ నిలదీయాలి, లేదంటే కాంగ్రెస్ ఎంపీ రేవత్ రెడ్డి విసిరిన సవాలు కేటీఆర్ స్వీకరించి ఢిల్లీ వేదికగా ఉద్యమానికి సిద్ధ కావాలి, అయితే వ్యవసాయ చట్టాల విషయంలో తోక ముడిచిన  తెరాసకు అంత సీన్ ఉందా అన్నదే సామాన్యుల సందేహం. అధికార,ప్రతిపక్ష పార్టీలు ఆత్మవంచనకు పాల్పడుతున్నాయి ... ప్రజలను వంచన చేస్తున్నాయి.