హద్దులు దాటుతున్న మాటల యుద్ధం 

అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలలో రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మాములు విషయం. ఎన్నిక ఎన్నికకు నాయకుల స్థాయి, ఏ స్థాయికి దిగజారిందో ఎన్నికల ప్రచారంలో వారు ప్రయోగించే మాటలలో బయటపడి పోతుంటుంది.ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరుగతున్న ఎన్నికలలో రాజకీయ సభ్యత చివరి మెట్టుకు చేరింది అని పిస్తోంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంటే, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే, ఈ ఎన్నికల ప్రధాన్యాత కొంచెం తక్కువ అనిపిస్తుంది. 

మాటల యుద్ధంలో మాత్రం ఉభయ రాష్ట్రాలలో నేతల తీరు ఒకేలా ఉంది ... కొద్ది రోజులక్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరుగతున్న ఎన్నికలలో బీజేపీ ప్రచారం హుందాగా ఉండాలని, ఎక్కడా మాట తూలవద్దని పార్టీ నాయకులు, క్యాడర్’కు సూచించారు.ప్రదాని ప్రత్యక్షంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అది కూడా ఆ ఐదు రాష్టాల వారికి మాత్రమే చేసిన సూచనే  అయినా, పార్టీలు, రాష్ట్రాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా బీజేపీ నాయకులకు మోడీ మాట మరింత శిరోధార్యం. అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్’ ముఖ్యమత్రిని వినడానికి, రాయడానికి కూడా కొంచెం ఇబ్బదికరంగా ఉండే, ‘బట్టే బాజ్’ అని దుర్భాషలాదారు. ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని మాట తూలారు. బండి సంజయ్ గీత దాటి చేసిన వ్యాఖ్యలు  కేసీఆర్’ కంటే మోడీకే ఎక్కువ గుచ్చుకుంటాయి. ఆయన మాటను సొంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే బేఖాతరు చేయడం అది ఆయనకూ అవమానమే. 

అయితే తెరాస నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్’ కూడా భాష విషయంలో అందరికంటే ఒకాకు ఎక్కువే చదివారు. మఖ్యమంత్రి అనేక సందర్భాలలో ప్రధానమంత్రి సహా అనేక మంది జాతీయ నాయకులను చులకన చేసి మాట్లాడారు. ఇక  రాష్ట్ర నాయకులను ఆయన పశు పక్షాదులతో పోల్చి దుర్భాషలాడిన సందర్భాలు కోకొల్లలు.

రెండు ఎమ్మెల్సీ సీట్లకు జరుగుతున్న ఎన్నికలలో ఇంత హైప్, ఇంట హీట్ ఇంతగా రెచ్చిపోయి ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారడం ఏమిటో, ఎవరికీ అంతు చిక్కడం లేదు. అలాగే, ఏపీలోనూ జరిగింది పంచాయతీ ఎన్నికలు, జరుగుతున్నది మున్సిపల్ ఎన్నికలే అయినా, పరస్పర దూషణల జోరు ‘అసహ్యపు’ హద్దులను దాటి, దూసుకు పోతోంది. అయితే, ఇక్కడ ఎవరికీ ఎవరు తీసిపోరు, అందుకే సామాన్యులు  .. అంతా అదే తాను పీసులే అని నవ్వుకుంటున్నారు.