ఏయూ వీసీపై గవర్నర్ సీరియస్! సెలవుపై పంపించిన సర్కార్  

ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సెలర్‌  పీవీజీడీ ప్రసాదరెడ్డి సెలవుపై వెళ్లారు. గత నెల 28న విశాఖలో జరిగిన రెడ్డి కుల సంఘం సమావేశానికి ఆయన హాజరు కావడం వివాదాస్పదమైంది. ఆయన వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయనను సెలవులో పంపింది. 

గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఇదే సమావేశానికి వీసీ ప్రసాదరెడ్డి కూడా హాజరై సాయిరెడ్డి పక్కన కూర్చొని.. అధికార పార్టీకి మద్దతుగా మాట్లాడారు. ఆ వీడియోలో వైరల్ గా మారడంతో వివాదాస్పదమైంది. ఈ నెల 1న విశాఖలో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు కొందరు ఈ విషయంపై ఫిర్యా దు చేశారు. దీంతో ఆయన ప్రసాదరెడ్డి వ్యవహారంపై విచారించాలని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను ఆదేశించారు. వర్సిటీలకు చాన్సెలర్‌ హోదాలో ఉన్న గవర్నర్‌ కూడా దీనిపై స్పందించారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు.. వీసీ ప్రసాదరెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. 


విశాఖలో వైసీపీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డికి ఇక్కడి పరిస్థితులు, నాయకులపై పూర్తి అవగాహన లేదు. దీంతో కీలకమైన విషయాల్లో వీసీ ప్రసాదరెడ్డి సలహాలు తీసుకుంటున్నారు. జీవీఎంసీకి గత ఏడాది ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించినప్పుడు వైసీపీలో టికెట్ల కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. సాయిరెడ్డి ఆ దరఖాస్తులను ప్రసాదరెడ్డికి అప్పగించారు. వాటిని పరిశీలించి, విజయం సాధించే అవకాశం ఉన్నవారి జాబితాను ఇవ్వాలని కోరారు. ఈ పని పూర్తిచేయడానికి అప్పట్లో ఇన్‌చార్జి వీసీగా ఉన్న ప్రసాదరెడ్డి తన విధులకు మూడు రోజులు సెలవు పెట్టి, రహస్యంగా ఓ గెస్ట్‌హౌ్‌సలో ఉండి ఆ పని పూర్తిచేశారని చెబుతున్నారు.ఆయన సూచించిన వారికే టికెట్లు లభించాయి. ఉప కులపతిగా ఉంటూ అధికార పార్టీ తరఫున పనిచేస్తుండడంతో పలువురు ఆయనపై ఫిర్యాదులు చేశారు.