చింతామణితో రాజకీయ చిచ్చు.. జగన్నాటకంలో రఘురామ ట్విస్టు..
posted on Feb 4, 2022 10:55PM
జగన్ హయాంలో ఏపీ డేంజరస్ పాలిటిక్స్‌కు వేదికగా మారింది. పైకి కనిపించేది ఒకటి.. లోలోన జరిగేది ఇంకోటి. జగన్- వైశ్యులు- చింతామణి- రఘురామల మధ్య రాజకీయ చదరంగం నడుస్తోంది. ఎవరికి వారు తెలివిగా పావులు కదుపుతున్నారు. ఎవరు ఎవరికి చెక్ పెడుతున్నారో క్లారిటీ లేదు. కానీ, చింతామణి నాటకంపై రాజకీయం మాత్రం రంజుగా సాగుతోంది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ ఎంట్రీతో మరింత రక్తి కడుతోంది. చింతామణి చుట్టూ అల్లుకున్న చిక్కుముడులన్నీ విప్పుతుంటే ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.
ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా ఆర్యవైశ్య సంఘాలు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. రోజుకో ప్లేస్, టైమ్ ఫిక్స్ చేసుకొని మరీ.. రఘురామకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. శాంతికాముకులైన వైశ్యుల కోపానికి కారణం.. చింతామణి నాటకం నిషేధాన్ని రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ హైకోర్టులో కేసు వేయడం. అంతమాత్రానికే ఆర్యవైశ్యులకు అంత కోపం వచ్చేసిందా అంటే.. వారి వెనకాల వైసీపీ పెద్దలు ఉన్నారని వేరే చెప్పనవసరం లేదులే. వైసీపీ వెనకుండి.. వైశ్యులను ముందుంచి.. రఘురామకు వ్యతిరేకంగా ధర్నాలు చేయిస్తోందనేది ఓపెన్ టాక్.
మరి, రఘురామ ఏమైనా చేయకూడని పని చేశారా? చిన్నచిన్న కారణాలతో దశాబ్దాల చరిత్ర ఉన్న నాటకాన్ని నిషేధించిన నియంతృత్వ పోకడనే ఆయన ప్రశ్నించింది. అంతేగాని, వైశ్యులను అవమానించాలనే ఉద్దేశ్యం ఆయనలో ఉండి ఉండకపోవచ్చు. హైకోర్టు సైతం రఘురామ పిటిషన్‌పై పాజిటివ్‌గా స్పందించడం చూస్తుంటే.. ఆయన చేసింది కరెక్టే అనిపించక మానదు. కేవలం, ఓ నాటకంలో ఓ క్యారెక్టర్ కొన్ని వ్యాఖ్యలు చేసినంత మాత్రాన.. మొత్తం నాటకాన్నే నిషేధించడం సరికాదన్నట్టు న్యాయస్థానం సైతం అభిప్రాయపడింది. రఘురామ చేసిన పనిని తెలుగు నాటక, సాహిత్య ప్రియులంతా హర్షిస్తున్నారు కూడా. ఇప్పుడు చింతామణిపై నిషేధాన్ని ప్రశ్నించకపోతే.. ముందుముందు మరో నాటకమో, నవలనో గొంతు మూసే సాహసానికి తెగబడే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.
మళ్లీ వైశ్యుల విషయానికి వద్దాం. తెలివైన వారిమని చెప్పుకునే ఆ వర్గమంతా.. ఇలా రఘురామను కార్నర్ చేసే తెలివి తక్కువ పని చేస్తున్నారనేది విశ్లేషకుల మాట. చింతామణితో జగనన్న ఆడుతున్న ఆటను.. వైశ్యులు గుర్తించలేక పోతున్నారా? లేక, అన్నీతెలిసే అన్నీమూసుకుని ఉన్నారా? అనే అనుమానం రాకమానదు. ప్రస్తుతానికి రఘురామ టైమ్ బాగా లేదు కాబట్టి.. ఆయనపై ఎంతెత్తు ఎగిరినా ఏమీ కాదని.. పైగా అధికార పక్షం సపోర్టూ ఫుల్లుగా ఉంటుంది కాబట్టి.. నరసాపురంలో నిరసనలు చేస్తున్నారు కానీ.. అసలు వైశ్యులను దారుణంగా అవమానించిన జగనన్న అండ్ బ్యాచ్ జోలికి వెళ్లాలంటే ఆ వర్గానికి వణుకనే చెప్పాలి. అసలే, వ్యాపారాలు చేసుకునే వాళ్లు కదా.. ఆమాత్రం భయం ఉంటుందిలెండి అది వేరే విషయం.
అసలు చింతామణి నాటకం నిషేధం వెనుక ఎంత పెద్ద రాజకీయం నడిచిందో కాస్త ఆలోచిస్తే ఈజీగానే అర్థమైపోతుంది. మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి, ఆర్యవైశ్య జాతిరత్నం.. రోశయ్య అస్తమయం నుంచి మొదలైంది అసలు కథ. వైఎస్సార్ మరణం తర్వాత తనకు దక్కాల్సిన ముఖ్యమంత్రి సీటును.. రోశయ్య కొట్టేశారనే అక్కసుతో.. ఆ పెద్దాయన చనిపోతే చివరి చూపు చూట్టానికి కూడా వెళ్లలేదు జగన్మోహన్‌రెడ్డి. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. అంతటి కుంచిత స్వభావం చూపించడాన్ని అప్పట్లోనే అంతా తప్పుబట్టారు. వైశ్య వర్గాలు జగన్ తీరుపై మండిపడ్డాయి. అది జరిగిన కొన్నాళ్లకే.. సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ మరింత అగ్గి రాజేసింది.
పాపం.. ఆ ఒంగోలు గుప్తా చేసిన తప్పేమీ లేదు. జగన్ పార్టీలో ప్రస్తుతం అంతర్గతంగా చోటు చేసుకుంటున్న అరాచకం.. దాని వల్ల భవిష్యత్తులో పార్టీకి, కేడర్‌కు ఎదురయ్యే ఇబ్బందులపై మాట్లాడారు అంతే. ఆ చిన్నపాటి సలహాలనే భరించలేకపోయారు వైసీపీ నేతలు. సొంత పార్టీ నాయకుడని కూడా చూడకుండా.. సుబ్బారావు గుప్తాను వెంటాడి.. వేటాడారు. గుప్తా మీదకు.. తన ప్రధాన అనుచరుడైన ఓ రౌడీ షీటర్‌ను ఉసుగొల్పి దాడి చేయించారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసన్న. గుప్తాను కొట్టి.. మోకాళ్లపై కూర్చోబెట్టి.. క్షమాపణలు చెప్పించేదాకా వదలలేదు ఆ వైసీపీ మూక. సుబ్బారావుపై దాడి జరగడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో.. ఆర్యవైశ్యుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. అప్పటికే రోశయ్య ఎపిసోడ్‌తో జగనన్నపై గుర్రుగా ఉన్న వైశ్యులకు, గుప్తాపై బాలినేని అనుచరుల దాడి మరింత ఆగ్రహం తెప్పించింది. జగన్‌కు, వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్దమయ్యారు ఆర్య వైశ్యులు. ఆ విషయం గుర్తించిన అగ్రనేతలో కొంత ఆందోళన చెంది.. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మంత్రి బాలినేని.. సుబ్బారావు గుప్తాకు కేకు తినిపించి కాస్త కూల్ చేసే ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఒంగోలులో ఏర్పాటు చేయిస్తానంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అయినా, వైశ్యుల ఆగ్రహం చల్లారకపోవడం.. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక వాయిస్ పెరగడంతో ఇక లాభం లేదని తాడేపల్లి పెద్దలే నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఆర్థికంగా బలమైన వర్గంగా ఉన్న ఆర్య వైశ్యులతో పెట్టుకుంటే అసలుకే ఎసరు వస్తుందని గుర్తించిన వైసీపీ పెద్దలు.. రోశయ్య, సుబ్బారావు గుప్తాలతో జరిగిన డ్యామేజీని కంట్రోల్ చేయడానికి.. ఆ వర్గం ఏనాటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్న చింతామణి నాటకాన్ని సడెన్‌గా నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఆ పరిణామంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అదేంటి.. ఇప్పుడెవరూ అడక్కుండానే.. ఎవరూ రోడ్డెక్కకుండానే.. ఎవరూ ఉద్యమాలు, ధర్నాలు చేయకుండానే.. వైశ్యుల కోరిక మేరకంటూ.. చింతామణి నాటకానికి పర్మినెంట్‌గా శుభం కార్డు వేయడం.. వైసీపీ ఆడుతున్న రాజకీయ నాటకమని ఇట్టే అర్థమైపోతోందని అంటున్నారు. ఇంత చిన్న విషయం పశ్చిమ గోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘాలకు అర్థమైనా.. అర్థం కానట్టు నటిస్తూ.. కోర్టులో కేసు వేశారనే కారణంతో ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని చర్చించుకుంటున్నారు.
వైశ్యుల మనోభావాలు అంతలా దెబ్బతింటే.. రోశయ్య చనిపోతే వెళ్లని జగన్‌రెడ్డిని నిలదీసి ఉండాల్సింది. ఆ తర్వాత సుబ్బారావు గుప్తాను కొట్టినప్పుడైనా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కాల్సింది. ఆ రెండు సందర్భాల్లో పెద్దగా నోరెత్తని ఆ వర్గం.. ఇప్పుడు మాత్రం ఎంపీ రఘురామ కోర్టులో కేసు వేశారంటూ నిరసనలు చేస్తుండటం విడ్డూరమే.. రాజకీయ దురుద్దేశ్యమే..అంటున్నారు. ఈ సందర్భంగా సింగిల్ హ్యాండ్‌తో తనకు జరిగిన అన్యాయం, తనపై జరిగిన దాడిపై ఒంటరి పోరాటం చేస్తున్న సుబ్బారావు గుప్తాను కులమతాలకు అతీతంగా అంతా అభినందిస్తున్నారు. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని, ఏపీలో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ.. ఏకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు సుబ్బారావు గుప్తా. కేంద్ర హోంమంత్రి అమిత్‌షానే తనను కాపాడాలంటూ ఆయన్ను కలిసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఆర్యవైశ్యులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. వారి వెనుక ఎలాంటి రాజకీయ శక్తులు లేవని నిరూపించుకోవాలంటే.. తమ వాడైన సుబ్బారావు గుప్తాకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందంటున్నారు. అంతేకానీ, ఎవరి ప్రోద్బలంతోనో ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా గొంతు చించుకుంటే ఉపయోగం ఏముంటుందని.. ఎవరి ప్రయోజనం కోసమో.. తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. చింతమణి నాటకంపై నిషేధం ఎలాగూ కోర్టులో నిలబడేది కాదంటున్నారు.. అంతవరకూ ఈ చింతామణి రాజకీయ నాటకానికి శుభం కార్డు పడకపోవచ్చు.