ఫోన్ ట్యాపింగ్ కేసు..రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిమణం నెలకొంది. రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరు కానున్నారు. తమ ఫోన్లు ట్యాప్ చేశారని బీజేపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు వారి వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. 2023 నవంబర్ 15న 600 మంది నేతల ఫోన్ల ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్ ఆపరేషన్‌ను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఆయన బీజేపీ నేతల రాజకీయ ప్రణాళికలు, ఆర్థిక సహాయం అందించే వ్యక్తుల గురించి సమాచారం సేకరించి, ఈ వివరాలను అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు చేరవేశారని, భుజంగరావు ఈ సమాచారాన్ని బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చి, రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఉపయోగించారని సిట్ విచారణలో తేలింది.ఈ కేసులో ప్రభాకర్ రావు, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్ కుమార్‌లతో పాటు ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు