సీఎం ఫోన్ ట్యాప్: కేరళం ముఖ్యమంత్రిపై నిరంతర నిఘా: స్వయంగా వెల్లడించిన సతీశన్.!
Published on: Fri Nov 27, 2026 10:48AM

ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే తన ఫోన్ ట్యాప్ అవుతోందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అవ్వడం మాత్రమే కాదు, తాను నిరంతర నిఘాలో ఉన్నానని ఆందోళన వ్యక్తం చేశారు. ఔను ఫోన్ ట్యాపింగ్, నిఘా గురించి కేరళం ముఖ్యమంత్రి సతీసన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని, తనపై నిరంతరం నిఘా ఉందని అన్నారు. అందుకే వింటున్న వారిని అయోమయంలోకి నెట్టి వారిని గందరగోళంలో పడేయడానికి తాను ఉద్దేశపూర్వకంగానే ఫోన్ లో తప్పుడు ప్రకటనలూ, అవాస్తవాలనూ చెబుతుంటానన్నారు.
కేరళం ముఖ్యమంత్రి సతీసన్ తిరువనంతపురంలోని కేరళ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చైర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రారంభించి ప్రసంగించారు. ఏఐ ప్రభావం పెరిగిపోవడంతో ప్రజలు సొంతంగా నిర్ణయాలు తీసుకునే, ఆలోచించే అవకాశాన్ని కోల్పోతున్నారన్న ఆయన.. తన ప్రసంగంలో జార్జ్ ఆర్వెల్ రాసిన 1984 నవలతో పాటు ఫ్రీడమ్ టు థింక్ అనే పుస్తకాలను ప్రస్తావించారు. ఆ పుస్తకాలు చదివిన తర్వాత తాను నెలరోజుల పాటు ఒత్తిడి, అభద్రతా భావానికి గురయ్యానని తెలిపారు. అందుకే ఇప్పుడు నిరంతర నిఘాలో ఉన్నామనే విషయం తెలిసినా తాను ఆందోళన చెందడం లేదన్నారు.
తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని తనకు తెలుసునని, అందుకే ఫోన్ వింటున్న వారిని తప్పుదోవ పట్టించడానికి కొన్నిసార్లు కావాలనే తప్పుడు విషయాలు చెబుతుంటానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎవరికీ ప్రైవసీ లేదనీ, ప్రతి ఒక్కరిపైనా నిఘా కొనసాగుతోందని అన్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక కేంద్ర లేదా రాష్ట్ర ఏజెన్సీలలో ఎవరు ఉన్నారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.మాల్స్ లేదా సూపర్‌మార్కెట్లకు వెళ్లినప్పుడు కెమెరాల ద్వారా మన కదలికలు, ముఖకవళికలను నిరంతరం గమనిస్తారని సతీశన్ వివరించారు. ఏఐ సాయంతో మన అభిరుచులు, ప్రవర్తనను విశ్లేషించి, మనం తిరిగి వాహనం వద్దకు చేరేలోపే మనకు నచ్చే బ్రాండ్లు, ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు ఫోన్‌లో వస్తాయనీ, మనం ఏం తినాలి, ఏం ఆలోచించాలి అనేది కూడా మరొకరు నిర్ణయించే పరిస్థితి ఏర్పడిందని కేరళం సీఎం అన్నారు.

డిజిటల్ యుగంలో డేటా సేకరణ, కెమెరాలు, ఏఐ అల్గారిథమ్‌ల ద్వారా వ్యక్తిగత అలవాట్లను విశ్లేషించడం సాధారణంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ పౌరుల గోప్యత, వ్యక్తిగత నిర్ణయాలపై పడుతున్న ప్రభావం గురించి వివిధ వేదికలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ సీఎం తన ఫోన్ ట్యాపింగ్, తనపై నిఘా అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతసంతరించుకున్నాయి.
ఇది కూడా చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్ కు భారీ ఊరట
రాజ్యాంగ దినోత్సవ వేదికగా ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో సంచలనంగా మారాయి. నిఘా వ్యవస్థలు, సాంకేతిక పర్యవేక్షణ, గోప్యత పరిరక్షణ వంటి అంశాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్నీ, అలాగే ఏఐ నియంత్రణ ఆవస్యకతను మరో సారి ఎత్తి చూపాయి.

కేరళ సీఎం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి అధికారిక స్పందనలు రావాల్సిఉంది. అలాగే ఏఐ ఆధారిత నిఘా, డిజిటల్ గోప్యత అంశాలపై భవిష్యత్తులో విధానపరమైన చర్చలు మరింత విస్తృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీని విచారించిన సీట్.!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రధాన నిందితుడిగా కేసీఆర్: సిట్ అదనపు చార్జిషీట్.?
[Phone tapping, Kerala CM, VD Satheesan, surveillance, AI, TeluguOne]


