TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రధాన నిందితుడిగా కేసీఆర్: సిట్ అదనపు చార్జిషీట్.?

Published on: Thu Oct 29, 2026 9:57AM

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చేటు చేసుకుంది. ఈ పరిణామం అధికార విపక్షాల మధ్య రాజకీయ ఘర్షణను మరో లెవెల్ కు తీసుకువెళ్లే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ కేసులో  బీఆర్ఎస్ అధినేత,  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం అదనపు ఛార్జిషీట్‌ను సిద్ధం చేస్తోందన్న ప్రచారం జోరందుకుంది. 

ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ  వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కె. నవీన్‌ల పేర్లు కూడా ఈ అదనపు చార్జిషీట్ లో ఉండనున్నాయి.  దర్యాప్తు అధికారులు, సాక్షుల వాంగ్మూలాలు,  సాంకేతిక ఆధారాలతో పాటు,   కేటీఆర్,  నవీన్‌లకు సంబంధించిన ఆరోపణలలో, ఎన్నికల బాండ్ల ద్వారా రూ.13 కోట్లు విరాళంగా ఇవ్వాలని తనను బలవంతం చేశారంటూ ఓ రియల్టర్  ఇచ్చిన వాంగ్మూలం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును   దర్యాప్తును వేగవంతం చేసిన  సిట్, ఈ అదనపు చార్జిషీట్ ను త్వరలోనే కోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.   గతంలో రాష్ట్రంలో ప్రభుత్వ మారిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ట్యాపింగ్ ఉదంతంపై సుదీర్ఘకాలంగా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రారంభంలో పలువురు పోలీసు అధికారులను మాత్రమే నిందితులుగా చేర్చినప్పటికీ, రానురాను ఈ విచారణ రాజకీయ నాయకుల పాత్ర వైపు మలుపు తిరిగింది. తాజాగా సిట్ రూపొందిస్తున్న అదనపు చార్జ్‌షీట్‌లో కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్లు కూడా  ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసులో భాగంగా గతంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. నాటి ప్రభుత్వ నిర్ణయాలు, నిఘా విభాగానికి చెందిన కీలక అధికారులతో ఆయనకున్న సంబంధాలపై ఆ సమయంలో ఆరా తీశారు. అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కేవలం పోలీసు అధికారులకే పరిమితం కాకుండా, ఈ నిఘా కార్యకలాపాల వెనుక ఉన్న రాజకీయ నాయకత్వాన్ని కూడా ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా కోర్టు ముందుకు తీసుకురావాలని సిట్ భావిస్తున్నది. అయితే,   చార్జ్‌షీట్ దాఖలైన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

[KCR Name In Phone Tapping Case,SIT Aditional Charge Sheet,  SIT Investigation, Telangana Politics, Telugu One]