పీఎఫ్ నిబంధన..భగ్గుమన్న కార్మికలోకం

కేంద్రం నిన్న ప్రకటించిన కొత్త పీఎఫ్ నిబంధనల పట్ల దేశవ్యాప్తంగా కార్మిక లోకం భగ్గుమంది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో కార్మికులు నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. భారత ఐటీ రాజధాని బెంగుళూరు నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. నగరంలోని గార్మెంట్ ఫ్యాక్టరీ వర్కర్స్ వేలాదిగా తరలివచ్చి వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసులు దీనిని అడ్డుకోవడంతో పలుచోట్ల కార్మికులు విధ్వంసకాండకు దిగారు. బస్సులు, ఇతర వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి. అసలు కార్మికులు ఇంతగా రగిలిపోవడానికి కారణమేంటి..?

 

 గత నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. కాని సవరణ ప్రకారం రిటైర్మెంట్ వయసు వచ్చేదాకా మొత్తం సోమ్మును విత్ డ్రా చేసుకోవడం కుదరదు. ఒకవేళ ఉద్యోగం పోయిన పక్షంలో ఉద్యోగి తన వాటాగా చెల్లించిన మొత్తాన్ని, వడ్డీని మాత్రేమే వెనక్కి పొందగలడు, యాజమాన్యం వాటా మాత్రం రిటైర్మెంట్ అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఉద్యోగానికి రాజీనామా చేసి పీఎఫ్ సోమ్ము తీసుకోవడం ఇంతకు ముందు ఉండేది కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తన వాటా మాత్రమే తీసుకోగలడు.

 

యజమాని వాటా రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి వీలుంది. రిటైర్మెంట్ వయసు 55 సంవత్సరాలైతే దీనిని 58 ఏళ్లకు పెంచారు. పాత నిబంధన ప్రకారం రిటైర్మెంట్‌కు ఏడాది ముందు..అంటే 54 ఏళ్ల వయసులో పీఎఫ్ మొత్తంలో 90 శాతాన్ని మాత్రమే తీసుకునే అవకాశముంది. రిటైర్మెంట్ వయసును 58 ఏళ్లకు పెంచడం వల్ల ఈ అవకాశం 57 ఏళ్లకు మాత్రమే వస్తుంది. నిబంధనలు కఠినతరం కావడంతో కార్మికుల్లో అసంతృప్తి పెల్లుబికింది. వెంటనే నష్టనివారణ చర్యలు ప్రారంభించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పాత నిబంధనలే అమల్లో ఉంటాయని చెప్పారు. యాజమాన్య కోటాలోని 3.67 శాతంపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ఉదయం జరిగిన మీడియా సమావేశంలో కొత్త నిబంధనలను ఆగష్టు 1 నుంచి అమల్లోకి తెస్తామన్న ఆయన సాయంత్రం మరోసారి మీడియా ముందుకు వచ్చి నిబంధనలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

 

అసలు ఇంత తతంగాన్ని జరపాల్సిన అవసరం కేంద్రానికి ఏమోచ్చింది. అసలే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి సాహసం ఎందుకు చేయాల్సి వచ్చింది. అందుకు సమాధానం ఒక్కటే దేశ నిర్మాణానికి,  పారిశ్రామికాభివృద్ధికి డబ్బు కావాలి. దానికి బాండ్లు, సెక్యూరిటీలు ఎన్ని ఉన్నా సరిపోవడం లేదు. అందుకే కేంద్రం కన్ను భవిష్యనిధిపై పడింది. రిటైర్ అయ్యే వరకు పీఎఫ్ సోమ్మును తన దగ్గరే అట్టిపెట్టుకుని వాటిని ఇతర పథకాలకు మళ్లించాలని కేంద్రం స్కెచ్. కాని కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోయాయన్న వాస్తవాన్ని మోడీ గుర్తిస్తే మంచింది. లేదంటే బెంగుళూరు హీట్ దేశం మొత్తం పాకుతుంది.