పేర్ని నానికి అరెస్ట్ భయం వెంటాడుతోంది : మంత్రి కొల్లు రవీంద్ర
posted on Jun 13, 2025 5:40PM

అరెస్ట్ భయంతో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడిని గెలిపించుకోవడానికి నాని పడరాని పాట్లు పడ్డారని, నకిలీ పట్టాలు సృష్టించారని ఆయన అన్నారు. ఎమ్మర్వో ఆఫీసులో నకిలీ పట్టాలు రాస్తుంటే తాము పట్టుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2023లో బదిలీ అయిన తహసీల్దార్‌తో 2024లో ఎన్నికల ముందు సీఆర్‌జెడ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఎలా ఇప్పించారు? ఇది చట్టవిరుద్ధమని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టాయి" అని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.
గత ఐదేళ్లలో ఆయన దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు. దమ్ముంటే విచారణకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. "గత ఐదేళ్ల పాలనలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, బందరు నియోజకవర్గాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఓటమి తర్వాత కూడా బుద్ధి రాలేదు. అరెస్ట్ భయంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేర్ని నాని ఒక బ్రోకర్‌లా వ్యవహరించారు" అని మంత్రి కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.