వినాయక మంటపాలకు అనుమతుల గొడవ
posted on Sep 17, 2012 11:36AM

వినాయక చవితి పందిళ్ళు వేసుకోవాలంటే ఆయా ప్రాంత పోలీసుల నుంచి అనుమతిని విధిగా పొందాల్సిందేనంటూ పోలీసులు ఒక పక్క హుకుంజారీ చేస్తుంటే ` మరోపక్క భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి మాత్రం ఎటువంటి అనుమతులూ పొందవలసిన అవసరంలేదంటున్నారు. ఈ మేరకు తాము ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి హామీ కూడా పొందామని ఆయన చెప్పారు. పోలీసుల నుంచి అనుమతి పొందాలన్న నిబంధన ముఖ్యోద్దేశం హిందువుల ఐక్యతను దెబ్బతీయడమే అవుతుందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి తాము రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి పోలీసులు అమలుచేస్తున్న నిర్బంధ నిబంధనల గురించి వివరించగా ‘అనుమతుల పేరుతో ఎవరినీ వేధించవద్దంటూ’ సూచించారన్నారు. ఇదిలా వుంటే ` చవితి పందిళ్ళ ఏర్పాటు విషయంలో ముందస్తు అనుమతులు పొందాలన్న ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయకున్నప్పటికీ పోలీసులు మాత్రం అనుమతులు తప్పనిసరిగా పొందవల్సిందేనంటూ స్పష్టం చేస్తున్నారు. గణేష్ ఉత్సవ ఏర్పాటుకు సంబంధించి అనుమతులు పొందడం వల్ల` ఉత్సవ సమయంలో ఎటువంటి అవాంఛనీయసంఘటనలూ జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వినాయక ఉత్సవాల పేరు చెప్పి స్థానికులనుంచి బలవంతంగా చందాలు వసూలు చేస్తున్నా, లౌడ్‌స్పీకర్లతో శబ్దకాలుష్యం సృష్టించి స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నా కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమతుల విషయం ఎలా ఉన్నప్పటికీ ` ఇప్పటికే ప్రజల నుంచి చవితి చందాల కోసం పందిరి నిర్వాహకుల ఒత్తిడి బాగా పెరిగిందన్నది నిజం!