తాడిపత్రిలో పెద్దారెడ్డికి జేసీతోనే కాదు.. సొంత పార్టీ నేతలతోనూ తలనొప్పే!

అనంతపురంలో జిల్లాలోని తాడిపత్రి వెళ్లేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులను నిలిపివేసింది. తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించగా..  పోలీసులు భద్రత కల్పించాలని సింగిల్‌ జడ్జి బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను అనంతపురం ఎస్పీ సవాల్‌ చేశారు. ఆ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కేతిరెరడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో  ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతకాలానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లడానికి లైన్ క్లియర్ అయింది.

అధికారం అటు,ఇటు మారడం, తాడిపత్రి సెగ్మెంట్లలో  గెలుపోటములు సాధారణమే అయినా టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి, జేసీ వర్గంపై 2019 ఎన్నికల్లో మొదటి సారి వైసీపీ నుంచి గెలిచి ఆధిపత్యం చెలాయించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు మాత్రం మొదటి నుంచి తమ వైఖరి మారదంటున్నారు.  తాడిపత్రిలో ఫ్యాక్షన్ వాతావరణం స‌ృష్టిస్తూ అటు ప్రజలను, ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని టెన్షన్ పెడుతూనే వస్తున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన హవా నడిపించారు. ఏకంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కూర్చుని సవాల్ విసిరారు.  ఆ విషయం అప్పట్లో సంచలనం రేపింది. అంతటితో ఆగకుండా ఏకంగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రి రాకుండా అనేక సందర్భాల్లో అడ్డుకున్నారు 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. పొజిషన్స్ ఛేంజ్ అయ్యాయి. కేతిరెడ్డి అపోజిషన్‌లోకి వచ్చేశారు. ఇంకేముంది అందరూ అనుకున్నదే జరుగుతోంది. కేతిరెడ్డి ఘోరీ మహమ్మద్‌లా అనేక మార్లు తాడిపత్రి లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం.. దాన్నిజేసీ వర్గం అడ్డుకోవడం షరా మాములు అయింది...ఆ క్రమంలో ఇటీవల తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు తీసుకొచ్చారు పెద్దారెడ్డి. 

హైకోర్ట్ ఆదేశాలతో ఇక తనకు లైన్ క్లియరైందని పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి రెడీ అయినా, ఎప్పటికప్పుడు జేసీ వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో  పోలీసులు  లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటూ పెద్దారెడ్డిని అడ్డుకున్నారు . పైగా కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీలుకు వెళ్లారు. దీంతో మూడు వారాల పాటు స్టే విధించింది హైకోర్ట్. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లలేకపోయారు. ఒకవేళ  బలవంతంగా అడుగు పెట్టగలిగినా అక్కడ యాక్టివ్ పాలిటిక్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. 

తాడిపత్రిలో పెద్దారెడ్డి తప్ప,  వైసీపీ తరపున ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చని స్పష్టంగా చెబు తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతే తప్ప మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి  కొడుకులు, కోడళ్లను కూడా రానివ్వబోనని ప్రతిజ్ఞ చేశారాయన. దీంతో ఆ గ్యాప్ ను భర్తీ చేసేందుకు స్థానిక వైసీపీ నేతలు కొంత మంది తహతహలాడుతున్నారు. తాడిపత్రి స్థానిక వైసీపీ నేత, ఇంజనీరింగ్ కాలేజీ అధినేత రమేష్ రెడ్డి తాను పెద్దారెడ్డి ప్లేస్ లోకి రావాలని ఉత్సాహంగా ఉన్నారట. అలా పెద్దారెడ్డి స్థానాన్న భర్తీ చేయాలని రమేష్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారో లేదో అప్పుడే ఆ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు మరో వైసీపీ నాయకుడు వీఆర్ రామిరెడ్డి. 2014 ఎన్నికల్లో జేసీప్రభాకరరెడ్డికి మంచి పోటీనే ఇచ్చిన వీఆర్ రామిరెడ్డి చాలాకాలం తర్వాత తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం రేపుతున్నారు. రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నట్లు ఆయన ముఖ్య అనుచరులు అంటున్నారు.  అధిష్టానం నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించగా వైసీపీ కార్యకర్తలు తాడిపత్రి వైసీపీ ఇన్చార్జిగా విఆర్ రామిరెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారంట. 

ఎప్పుడో పాలిటిక్స్ నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న రామిరెడ్డి సడెన్ గా ఇప్పుడు తాడిపత్రికి రావడం అందులోనూ కార్యకర్తలతో సమావేశం అవడం తాడిపత్రి పాలిటిక్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఇన్నాళ్లు ఇద్దరు కృష్ణులే అనుకుంటే ఇప్పుడు మూడో కృష్ణుడు రూపంలో వీఆర్ రామిరెడ్డి రావడంతో తాడిపత్రి  వైసీపీ లో తీవ్ర గంగదరగోళం ఏర్పడింది.  అటు విపక్షం నుంచి, ఇటు స్వపక్షం నుంచి తలనొప్పులు ఎదుర్కొంటున్న పెద్దారెడ్డి ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu