జగన్‌కి చెక్ పెట్టేందుకు పవన్ స్కెచ్..! ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో?

ఊహించినట్లే శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. శాసనసభ ఆమోదించిన తీర్మానాన్ని త్వరలోనే కేంద్రానికి పంపనుంది. దాంతో, మండలి రద్దు కథ... కేంద్రం కోర్టులో చేరుతుంది. అయితే, మండలి రద్దును తీవ్రంగా ఖండిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ ... కేంద్రంలో చక్రం తిప్పగలరా అనే చర్చ జరుగుతోంది. బీజేపీతో కలిసి పనిచేస్తున్న పవన్ కల్యాణ్... మండలి రద్దును అడ్డుకోగలుగుతారా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే, మండలి రద్దుకు జగన్ ప్రభుత్వం తీర్మానం చేసినా.... కౌన్సిల్ రద్దు కావాలంటే మాత్రం అది కేంద్రం చేతిలో ఉంది. ఏపీ తీర్మానాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తేనే మండలి రద్దు జరుగుతుంది. దాంతో, ఏపీ విపక్షాల చూపు ఇప్పుడు మోడీ సర్కారుపై పడింది. అయితే, పవన్ కల్యాణ్ తన పలుకుబడిని ఉపయోగించి మండలి రద్దును అడ్డుకుంటారని జనసైనికులు అంటున్నారు. జగన్ దూకుడుకు చెక్ పెట్టేవిధంగా జనసేనాని పావులు కదుపుతున్నారని, కచ్చితంగా మండలి రద్దును అడ్డుకుంటారని వ్యాఖ్యానిస్తున్నారు.

బీజేపీతో కలిసి ఏపీలో ప్రజాఉద్యమాలకు శ్రీకారం చుడుతోన్న పవన్... మండలి రద్దు అంశంపైనా దృష్టిపెడతారని చెబుతున్నారు. ఇప్పటికే రాజధాని వికేంద్రీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేనాని... బీజేపీతో కలిసి పోరాడుతున్నారు. అయితే, మండలి ఇష్యూ కూడా కలిసిరావడంతో... కేంద్రంలో చక్రం తిప్పి జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు పవన్ ఆలోచిస్తున్నారట. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రానికి ముప్పు వాటిల్లుతోందంటూ ప్రధాని మోడీకి కంప్లైంట్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనాసరే మోడీ ద్వారా జగన్ కు చెక్ పెడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పవన్ పావులు కదుపుతున్నారని అంటున్నారు.

అయితే, బీజేపీ అగ్రనాయకులతో పవన్ కు సత్సంబంధాలుంటే.... మోడీ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి సఖ్యత కొనసాగిస్తున్నారు. అలాగే, కీలక బిల్లుల విషయంలో మోడీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతుగా నిలిచింది. మోడీ కూడా జగన్ విషయంలో సానుకూలంగానే ఉన్నారని అంటారు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ద్వారా జగన్ కు చెక్ పెట్టడం అంత సులభం కాదని అంటున్నారు.