మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్! ఎదురుపడినా పలకరించుకోని మంచు విష్ణు, పవన్..

మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ ఎన్నికలు జరిగి వారమైంది. కొత్త కార్యవర్గం బాధ్యతలు కూడా చేపట్టింది. అయినా మా ఎన్నికల వేడి మాత్రం చల్లారడం లేదు. పోలింగ్ రోజున ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మెగా , మంచు కుటుంబాల మధ్య మా వివాదం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలబ్ బలయ్ కార్యక్రమంలోనూ మా ఫైటింగ్ సీన్ రిపీటైంది. 

గవర్నర్ దత్తన్న ఆహ్వానంతో జల విహార్ లో జరిగిన అలబ్ బలయ్ ఆత్మీయ కార్యక్రమానికి హాజరయ్యారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు కూడా వచ్చారు.  వేదికపై ఇద్దరి సీట్లు పక్క పక్కనే వచ్చాయి. దీంతో వీళ్లద్దరిని అక్కడికి వచ్చిన వారు ఆసక్తిగా గమనించారు. కాని  కనీసం పలకరించుకోలేదు పవన్ కల్యాణ్, మంచు విష్ణు. ఎవరి సీటులో వాళ్లు అలా కూర్చుండిపోయారు. దత్తన్న నుంచి సన్మానం తీసుకుని వస్తున్న పవన్ ను పలకరించాలని విష్ణు ప్రయత్నించినా.. జనసేనాని పట్టించుకోలేదు. దీంతో కరచాలనం కోసం ముందుకు వచ్చిన మంచు.. పరిస్థితి అర్ధం చేసుకుని మళ్లీ వెనక్కి వెళ్లారు.

అలయ్ బలయ్ వేదికపై దాదాపు గంటపాటు పక్కపక్కనే కూర్చున్నారు పవన్ కల్యాణ్, మంచు విష్ణు. కాని ఒక్క మాట మాట్లాడుకోవటం కాదు కనీసం ఒకరి వైపు ఒకరు చూసుకోలేదు. వేదిక దిగి వెళ్లిపోయే సమయంలో అందరికి అభివాదం చేసుకుంటూ వెళ్లిన పవన్.. మంచు విష్ణుకు మాత్రం చేయలేదు. మంచు విష్ణు కూడా పవన్ కల్యాణ్ తో సాధ్యమైనంత దూరంగా ఉండటానికే ప్రయత్నించారు. అలయ్ బలయ్ వేదికగా కనిపించిన ఈ సీన్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి.

మా ఎన్నికలు రగిల్చిన వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుందని చెబుతున్నారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు సపోర్ట్ చేసింది మెగా కుటుంబం. ప్రకాశ్ కు మద్దతుగా నాగబాబు తన వంతు ప్రయత్నాలు చేశారు. పవన్ కల్యాణ్ కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడారు. దీంతో మా ఎన్నికల ఫలితం తర్వాత మెగా ఫ్యామిలీకి షాక్ తగిలిందనే ప్రచారమే జరిగింది. మా ఎన్నికల్లో విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ చేసినా.. అసలు పోటీ మాత్రం మోహన్ బాబు, చిరంజీవి మధ్య జరిగిందనే టాక్ నడిచింది. మా పోరులో చిరంజీవిపై మోహన్ బాబు విజయం సాధించారనే చర్చలు నడిచాయి. దీంతో మంచు, మెగా వర్గాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు అలానే సూచిస్తున్నాయి.