విశాఖ మీద దుష్ప్రచారం తప్పు: పవన్ కళ్యాణ్
posted on Oct 16, 2014 12:55PM
.jpg)
తుఫాను విపత్తు ఎదుర్కొన్న విశాఖపట్నం మీద దుష్ప్రచారం జరుగుతోందని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను వచ్చింది కాబట్టి విశాఖపట్నంలో ఐటీ రంగం అభివృద్ధి చెందదంటూ దుష్ప్రచారం చేయడం భావ్యం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం నాడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. తుఫాను బాధితులను ఆదుకోవడానికి తనవంతు సాయంగా 50 లక్షల రూపాయల చెక్‌ను చంద్రబాబు నాయుడికి అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ‘‘క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు చంద్రబాబులో వున్నాయి. వెయ్యి కోట్ల రూపాయల తక్షణ సాయం ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, ప్రజలకు అండగా వున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం తగదు. అందరూ చంద్రబాబుకి సహకరించాలి. విశాఖ స్మార్ట్ సిటీ అవబోతున్న వేళ ఈ విపత్తు బాధ కలిగిస్తోంది. ఈ వైపరీత్య సమయంలో విశాఖకు ఐటీ రంగం రాదని దుష్ప్రచారం జరుగుతూ వుండటం బాధాకరం’’ అన్నారు.