భూసేకరణ వద్దని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ లో ట్వీట్ లు చేసిన సంగతి తెలిసిందే. ఉండవల్లి, పెనుబాక, బేతపూడి గ్రామల్లో భూములను భూసేకరణనుండి మినహాయించాలని నేరుగా చంద్రబాబునే కోరారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లకు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా స్పందించి భూసేకరణ వద్దని చెపుతున్న పవన్ కళ్యాణ్ ఏ చేయాలో కూడా చెబితే బావుంటుందని ఒకింత వెటకారంగానే సమాధాన మిచ్చారు. అయితే దీనికి పవన్ కళ్యాణ్ కూడా స్పందించి నేను రైతుల సమస్యల గురించి.. వారి ఆవేదనల గురించి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే దాని వెటకారం చేయడం వారికే చెల్లిందని యనమలకు ఘాటుగా సమాధానమిచ్చారు. అయినా "సినిమా పరిశ్రమకు ఇచ్చింది హైదరాబాద్ లో ఉన్న కొండ ప్రాంతాలు కాని పంటలు పండే పచ్చని పొలాలు కాదని ఆ విషయాన్ని యనమల రామకృష్ణుడుకి తెలియదనుకుంటా" అని చురక అంటించారు.
ఇంకా "ముందు కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత అలోచించవచ్చు .." అని ట్వీటారు. కాగా త్వరలోనే బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నదీ పరివాహక గ్రామాల రైతులను కలుస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.