డ్రగ్స్ కేసులో చిలుకను అరెస్ట్ చేసిన పోలీసులు

 

మామూలుగానే చిలుకను పంజరంలో బందీ చేస్తాం. పాపం ఆ పంజరాన్ని అది జైలులా ఫీలవుతోంది. అయితే ఇప్పుడు పోలీసులు డ్రగ్స్ కేసులో ఓ చిలుకను అరెస్ట్ చేసి ఏకంగా జైలులోనే పెట్టారు. ఈ వింత ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.

బ్రెజిల్‌లో స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న పోలీసులకు.. నిందితులు ఓ ఇంట్లో పెద్ద ఎత్తున కొకైన్‌ను సరఫరా చేస్తున్నారన్న  సమాచారం అందింది. దీంతో ఆ ఇంటికి చేరుకొని స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అనుకున్న వెంటనే అక్కడికి పెద్ద ఎత్తున బలగాలతో చేరుకున్నారు. లోపల గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్న స్మగ్లర్లకు మాత్రం ఈ విషయం తెలియదు. కానీ.. గుమ్మం వద్ద పంజరంలో ఉన్న చిలుక పోలీసుల రాకను పసిగట్టింది. వెంటనే స్మగ్లర్లను అర్థమయ్యేలా 'పోలీస్.. రన్ రన్' అని అరిచింది. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు మరో మార్గం ద్వారా అక్కడి నుంచి పారిపోయారు. లోపలికి వెళ్లి చూసిన పోలీసులకు చివరకు నిరాశే మిగిలింది. చిలుక అరవడం వల్లే వాళ్లు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులకు అర్థమైంది. దీంతో నేరస్థులకు సహరించిందన్న అభియోగం కింద చిలుకను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే చిలుకను వదిలిపెట్టాలంటూ పర్యావరణ, పక్షి ప్రేమికులు నుంచి డిమాండ్లు రావడంతో చేసేదిలేక స్థానిక జంతుప్రదర్శనశాలకు అప్పగించారు. ఎగరడానికి దానికి మూడు నెలల పాటు శిక్షణనిచ్చి అనంతరం వదిలిపెడతారట.