నేటి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

 

నేటి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవబోతున్నాయి. డిశంబరు 23వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టి ఆరు నెలలు పూర్తయినందున, ఈ సమావేశాలలో మోడీ పనితీరు, ఆరునెలల పాలన, అభివృద్ధిపై లోతుగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ప్రధాని మోడీ అధికారం చేప్పట్టగానే ముందుగా వివిధ శాఖల ప్రక్షాళన, సంస్కరణలు చేసిన తరువాతనే పని ప్రారంభించాలనుకోవడం ప్రతిపక్షాలకు మోడీని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మంచి అవకాశం దక్కింది. ఆయన ఈ ఆరు నెలల్లో విదేశీ యాత్రలకి, ప్రచారార్భాటానికే ప్రాధాన్యత ఇచ్చేరు తప్ప దేశాభివృద్ధికి చేసిందేమీ లేదని ప్రతిపక్షాల వాదన. అందువలన సభలో ఇవే అంశాలు లేవనెత్తి మోడీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి.

 

ఈ సమావేశాలలో కేంద్రప్రభుత్వం 39 బిల్లులపై చర్చ జరిపి పార్లమెంటు ఆమోదం పొందాలని భావిస్తోంది. ముఖ్యంగా భీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం, బొగ్గు గనుల కేటాయింపుపై ఆర్డినెన్స్, ఆర్ధిక సంస్కరణలు, సేవా పన్ను తదితర అంశాలపై చర్చించి పార్లమెంటు ఆమోదం పొందాలని భావిస్తోంది. కానీ ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్, ఆర్.జే.డి. జే.డి.యు, జె.డి.యన్, సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాది తదితర పార్టీలన్నీ ఏకమయ్యి వివాద అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు సిద్దంగా ఉన్నాయి. లోక్ సభలో ఎన్డీయే కూటమికి మెజార్టీ ఉన్నందున అక్కడ వాటిని నిలువరించగలిగినప్పటికీ, రాజ్యసభలో ప్రతిపక్షాలకే ఎక్కువ బలం ఉంది కనుక అక్కడ వారిని ఎదుర్కోవడం మోడీ ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉండవచ్చును.