మాజీ కేంద్ర మంత్రి మురళీ దేవరా మృతి

 

మాజీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత మురళీ దేవరా (77) ఈరోజు తెల్లవారు జామున మరణించారు. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక సాధారణ సామాజిక కార్యకర్తగా జీవితం ఆరంభించిన ఆయన ఆ క్రమంలో రాజకీయ నేతలతో పరిచయాలు పెరగడంతో 1968లో రాజకీయ ప్రవేశం చేసి ముంబై మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో పోటీచేసి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. శివసేన మద్దతుతో 1977లో ముంబై మేయర్ అయ్యారు. ఆయన మొట్టమొదటిసారి 1980లో దక్షిణ ముంబై నియోజకర్గం నుండి లోక్ సభకు పోటీచేశారు కానీ ఓడిపోయారు. కానీ ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తరపున అదే నియోజక వర్గం నుండి పోటీ చేసి నాలుగుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అదే సం.లో యూపీయే ప్రభుత్వంలో పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.తిరిగి 2009లో డా.మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కూడా పెట్రోలియం మరియు సహజవాయువుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన 1981 నుండి 2003 వరకు ముంబై కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడుగా వ్యవహరించారు. పెట్రోలియం శాఖా మంత్రిగా ఆయన తీసుకొన్న కొన్ని సాహసోపేతమయిన నిర్ణయాలు ఆయనకు మంచి పేరు సంపాదించిపెట్టగా అవే అనేక వివాదాలకు కూడా కారణం అయ్యాయి.