ఆక్సిజన్ లీకై 22 మంది మృతి! మహారాష్ట్రలో ఘోరం

కరోనా మహమ్మరితో అతలాకుతలం అవుతున్న మ‌హారాష్ట్రలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్‌ ఆసుప‌త్రి స‌మీపంలో ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ నింపుతుండ‌గా ఒక్క‌సారిగా అది లీకైంది. దీంతో ఆ ఆస‌ప‌త్రిలో వెంటిలేట‌ర్‌పై ఉన్న రోగుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది.

ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీక్ కారణంగా రోగుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను ఆపేయాల్సి వ‌చ్చింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం వ‌ల్లే రోగులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన అధికారులు, సిబ్బంది ఆక్సిజ‌న్ లీకేజీని ఆపేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు. ఆక్సిజ‌న్ ట్యాంక్ లీక్ అయిన స‌మ‌యంలో ఆసుప‌త్రిలో 171 మంది రోగులు ఉన్నారు. కొంద‌రు రోగుల‌ను ఇత‌ర ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు  విచార‌ణ‌కు ఆదేశించారు.

ప్రమాదం జరిగిన వెంటనే మహారాష్ట్ర మంత్రి డాక్టర్ రాజేంద్ర షింగనే తెలిపిన వివరాల ప్రకారం, డాక్టర్ జకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఆక్సిజన్ ట్యాంకర్‌లో ఆక్సిజన్‌ను వేరొక ఆక్సిజన్ ట్యాంకర్ ద్వారా నింపుతున్న సమయంలో ప్రాణవాయువు బయటకు పెల్లుబికింది. దీంతో సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని డాక్టర్ షింగనే తెలిపారు. దీనిపై సవివరమైన నివేదికను తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ దారుణానికి బాధ్యులైనవారిని వదిలిపెట్టేది లేదన్నారు. 

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే మాట్లాడుతూ, నాసిక్‌లో ట్యాంకర్ వాల్వులు లీక్ అయినందువల్ల పెద్ద మొత్తంలో ఆక్సిజన్ లీక్ అయినట్లు తెలిపారు. దీని ప్రభావం ఆసుపత్రిపై కూడా ఉండే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇటువంటి సమయంలో ఈ దుర్ఘటన జరగడం మరింత బాధాకరం.