ఆక్సిజ‌న్ అమ్మేసుకున్నారు.. 9వేల ట‌న్నులు హుష్‌కాకి..

దేశమంతా క‌రోనా క‌ల్లోలం. వేలాది మందికి ప్రాణ సంక‌టం. ప్రాణ‌వాయువైన ఆక్సిజ‌న్‌కి ఫుల్ డిమాండ్‌. ఆక్సిజ‌న్ నిల్వ‌లు నిండుకున్నాయంటున్నాయి రాష్ట్రాలు. వెంట‌నే ఆక్సిజ‌న్‌ను పంపాలంటూ కేంద్రాన్ని కోరుతున్నాయి. ఆక్సిజ‌న్ కొర‌త గుర్తించిన కేంద్రం ప్ర‌త్యేకంగా ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌ల‌ను ప్రారంభించింది. ప‌రిమితంగా ఉన్న ఉత్ప‌త్తి కేంద్రాల నుంచి ఆక్సిజ‌న్ సేక‌రించి రాష్ట్రాల‌కు పంపుతోంది. ఇదంతా ఇప్ప‌టి విష‌యం. మ‌రి, సెకండ్ వేవ్ ముంచుకొస్తుంద‌ని ఎప్ప‌టి నుంచో హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నా.. కేంద్రం త‌ర‌ఫున ముంద‌స్తు చర్య‌లేవి?  దేశంలో ఆక్సిజ‌న్ నిల్వ‌లేవి?

నిల్వ సంగ‌తి త‌ర్వాత‌.. ఏడాదిగా భారీగా ఆక్సిజ‌న్‌ను బ‌య‌టి దేశాల‌కు అమ్మేసుకుంది కేంద్రం. ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా 9వేల ట‌న్నుల ప్రాణ‌వాయువు దేశం దాటేసింది. ఈ జ‌న‌వ‌రిలోనైతే మ‌రీ టూమ‌చ్‌. ఏకంగా 734 శాతం ఆక్సిజ‌న్ ఎగుమ‌తులు పెంచేసింది. 

గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు భారత్ 9 వేల టన్నులకుపైగా ఆక్సిజన్ ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మొత్తంగా 4,500 టన్నులు ఎగుమతి చేయ‌గా.. కేవ‌లం ఈ ఒక్క‌ జనవరిలోనే ఏకంగా మరో 4,500 టన్నులకు పైగా ఎగుమతి చేసినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఎగుమతుల లెక్కలను ఇంకా ప్రభుత్వం బయటకు వెల్లడించలేదు. 

ప్ర‌భుత్వం తీరుపై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిప‌డుతోంది. సెకెండ్ వేవ్ ముంచుకు రాబోతోందంటూ కొన్ని నెల‌లుగా సైంటిస్టులు సూచిస్తున్నా.. ఆక్సిజ‌న్ డిమాండ్ ఉంటుంద‌ని తెలుస్తున్నా.. ఇంత ఉదాసీనంగా ప్రాణ‌వాయువును అంగ‌టి స‌రుకుగా అమ్ముకోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. వంద కోట్ల‌కు పైగా ఉన్న దేశంలో వ్యాక్సిన్, ఆక్సిజ‌న్ ఎంత ఉన్నా త‌క్కువేన‌ని.. ఇంత చిన్న విష‌యం మ‌రిచి.. కేంద్రం టీకాల‌ను, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేయ‌డం ముమ్మాటికీ త‌ప్పేనంటూ రాహుల్‌గాంధీ తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ప‌రోప‌కార‌మంటూ కేంద్రం క‌వ‌ర్ చేసుకుంటున్నా.. ఇది స‌ర్కారు వైఫ‌ల్య‌మేన‌ని మండిప‌డుతున్నారు. 

మ‌రోవైపు.. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కొర‌త‌పై టాటా గ్రూపు త‌మ వంతు సాయం అందిస్తోంది. 24 లిక్విడ్ ఆక్సిజన్ క్రయోజనిక్ కంటైనర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు ప్రకటించింది.