ఉస్మానియా విద్యార్థుల ఆందోళన ఉద్ధృతం

 

తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల గుండెల పగిలేలా చేసింది. దాంతో వారు ఆందోళన బాట పట్టారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులను అణచివేసే ప్రయత్నాలను ప్రభుత్వం చేయడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు అగ్ని పర్వతాల్లా బద్దలవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉద్ధృతం చేశారు. మంగళవారం నాడు నిరుద్యోగ విద్యార్థుల ఆందోళనలతో ఉస్మానియా విశ్వవిద్యాలయం హోరెత్తింది. ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక వరకు విద్యార్థులు చేపట్టిన ర్యాలీని అడ్డుకోవాలనిపోలీసులు ఓయు చేసిన ప్రయత్నాలను విద్యార్థులు వ్యతిరేకించారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటి విద్యార్థులు తార్నాకకు చేరుకుని చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ఉస్మానియా విద్యార్థులపై కేసీఆర్ కక్షసాధింపు ధోరణిని ప్రదర్శిస్తున్నారని, ఉద్యమాలు కేసీఆర్‌కి కొత్తేమో కాని ఓయు విద్యార్థులకు కాదని మొన్నటి వరకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేశామని, ఇపుడు తమ జీవితాల కోసం ఉద్యమిస్తున్నామని వారు అన్నారు.