ఒక్క అడుగు.. ఒకే ఒక్క అడుగు!
posted on Nov 17, 2023 9:09AM
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆ ఎన్నికల వేడిని మించి మరో వేడి దేశం అంతటా జనాలను నిలవనీయడం లేదు. ఆబాల గోపాలం ఒక రకమైన ఉత్సాహం, పట్టలేనంత ఉత్కంఠతో ఊగిపోతున్నారు. నిజమే.. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో కూడా జనం మూడ్ అంతా ఎన్నికలపై కంటే.. దేశంలో ఒక మతంలాంటి క్రికెట్ మీదే ఉంది. భారత్ వేదికగా జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ చివరి అంకానికి వచ్చేసింది. విశ్వవిజేతగా నిలవడానికి తలపడనున్న జట్లేవో కూడా తేలిపోయింది. రెండు చాంపియన్ జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (నవంబర్ 19)న జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ పైనే ఇప్పుడు యావద్దేశం దృష్టి సారించింది. ప్రధాని మోడీ సైతం ఎన్నికల ప్రచారానికి సైతం విరామం చెప్పి అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి స్టేడియంకు వెళ్లనున్నారు.
ఇంతకీ ఆఫైనల్ లో తలపడనున్న రెండు చాంపియన్ జట్లూ ఏమిటంటే.. ఇప్పటికే రెండు సార్లు మెగా క్రికెట్ టోర్నీ వరల్డ్ కప్ లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. అదే టీమ్ ఇండియా ఒకటైతే...ఏకంగా ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మరో జట్టు. దీంతో అహ్మదాబాద్ లో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇక ఇప్పటి వరకూ జరిగిన టోర్నీలో ఈ రెండు జట్ల ప్రదర్శనా తీసుకుంటే.. నిస్సందేహంగా టీమ్ ఇండియా బెటర్ పెర్ఫార్మెన్స్ తో హాట్ ఫేవరెట్ గా ఉందనే చెప్పాలి. ఈ టోర్నీలో లీగ్ దశలో ఆడిన ఎనిమిది మ్యాచ్ లలోనూ సాధికారికంగా విజయం సాధించి.. ఆ తరువాత నాకౌట్ దశలో సెమీస్ లో దక్షిణాఫ్రికాపై అలవోక విజయం సాధించి ఈ టోర్నీలో ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా నిలిచిన టీమ్ ఇండియా మరొక్క విజయం సాధిస్తే విశ్వ విజేతగా నిలుస్తుంది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. తడబడుతూ, అసలు సెమీస్ అర్హత సాధిస్తుందా అన్న సందేహాల నడుమ గొప్పగా పుంజుకుని సెమీస్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్ కు వచ్చింది.
ఇంత వరకూ క్రికెట్ విశ్వవిజేతగా ఐదు సార్లు విజయం సాధించి గొప్ప రికార్డు ఉన్న ఆస్ట్రేలియాతో.. మూడు సార్లు విజేతగా నిలిచి విండీస్ తో కలిసి రెండో స్థానంలో ఉన్న భారత్ తలపడనుండటంతో ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రికార్డులను పక్కన పెడితే.. ప్రస్తుతం టీమ్ ఇండియా ఉన్న ఫామ్ చూస్తే భారత్ విజయం నల్లేరుమీద బండినడకే అని విశ్లేషణలు చేస్తున్న క్రీడా పండితులు కూడా ఆసీస్ ను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదనీ, ఓటమిని అంగీకరించిన ఆసీస్ విజయం కోసం చివరి వరకూ పోరాడుతుందని చెబుతున్నారు. విన్, డిఫీట్ రికార్డులను పక్కన పెడితే.. భారత్ వేదికగా టోర్నీ జరుగుతుండటం భారత్ కు ఓ విధంగా కలిసి వస్తుందని చెప్పాలి. అలాగే.. 2011 నుంచి వస్తున్న ట్రెండ్ ను ఒకసారి గమనిస్తే.. ఆతిథ్య జట్టే కప్ గెలుచుకుంటూ వస్తోంది. ఆ రకంగా చూసినా భారత్ వైపే త్రాసు మొగ్గు చూపుతోంది. 2011లో వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యమిచ్చింది. అప్పుడు ధోనీ కెప్టెన్సీలోని టీమ్ ఇండియా విశ్వ విజేతగా నిలిచింది. ఆ తరువాత క్రికెట్ వరల్డ్ కప్ కు 2015లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. అప్పుడు కూడా ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 2019లో వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఇంగ్లాండే ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి విజేతగా నిలిచింది.
1975లో మొదలైన వరల్డ్ కప్ టోర్నీ ప్రతి నాలుగేళ్లకూ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు ప్రపంచకప్ టోర్నీలకూ ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. తొలి రెండు సార్లూ విండీస్ విజయం సాధించగా 1983లో అండర్ డాగ్స్ గా టోర్నీలో అడుగుపెట్టిన భారత జట్టు కపిల్ దేవ్ సారథ్యంలో సంచలన విజయం సాధించింది తొలి సారిగా విశ్వ విజేతగా నిలిచింది.
ఆ తరువాత మళ్లీ 28 సంవత్సరాల తరువాత ధోనీ సారథ్యంలోని టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. ఇక ముచ్చటగా మూడో సారి ప్రపంచకప్ ను ముద్దాడేందుకు టీమ్ ఇండియా మరొక్క విజయం సాధిస్తే చాలు. క్రికెట్ గాడ్ రికార్డును సైతం అధిగమించేసి తిరుగులేని ఫామ్ లో ఉన్న కింగ్ కోహ్లీ, ఫస్ట్ పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా చెలరేగి బ్రహ్మాండమైన ఆరంభాన్నిస్తున్న హిట్ మేన్, జట్టు సారథి రోహిత్ శర్మ, అలవోకగా పరుగులు సాధిస్తున్న యువ బ్యాట్స్ మన్ శుభమన్ గిల్.. మిడిలార్డర్ లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్, రాహుల్ లతో భారత బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేధ్యంగా కనిపిస్తోంది. ఇంకా ఇప్పటి వరకూ సూర్యకుమార్ యాదవ్, అజయ్ జడేజా వంటి వారికి పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసే అవకాశమే లభించలేదంటే టాప్ ఆర్డర్ ఎంత పటిష్టంగా ఉందో అర్ధమౌతుంది.
ఇక బౌలింగ్ విభాగం విషయానికి వస్తే.. ఇంత కాలం స్పిన్ మాత్రమే భారత్ బలం అన్న అభిప్రాయాన్ని మన పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలు మార్చి పారేశారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ ఇండియా పేస్ అటాక్ ను ఎదుర్కోవడంలో అన్ని జట్లూ ఇబ్బంది పడ్డాయి అనడానికి సందేహించాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా షమీ మిస్సైల్ లాంటి బంతులతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మెన్ కు ఎలా ఆడాలో తెలియని పరిస్థితి కల్పించాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇక స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్ లు కూడా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్లు పరుగుల కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి కల్పించారు. మొత్తంగా జట్టు ఇప్పటి వరకూ కొనసాగించిన ఫామ్ ను కొనసాగిస్తే..తడబడుతూ ఫైనల్ కు చేరిన ఆసీస్ ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని క్రీడా పండితులు అంటున్నారు.