జమిలీ.. ఎన్నికల సంస్కరణల దిశగా తొలి మజిలీ?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  జమిలి ఎన్నికలపై చర్చ జరుుగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ కేంద్రం జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి జేపీసీకి పంపింది.  ఈ జమిలీ ఎన్నికల బిల్లును  బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింప జేసుకోగలదా అన్న సంశయం బీజేపీ నేతలతో సహా సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ బిల్లును ఆమోదింప చేసుకోవాలంటే సభలో మూడింట రెండోంతుల మంది మద్దతు అవసరం. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కు సభలో ఆ బలం లేదు. అయితే ప్రధాని మోడీ ఏ ధైర్యంతో ముందుకు వెడుతున్నారన్న సందేహం బీజేపీయేతర పార్టీలలో బలంగా వ్యక్తం అవుతోంది.  పార్లమెంటు ఉభయ సభల్లో జమిలి ఎన్నికలకు మద్దతు ఎలా సాధించగలదన్న  అనుమానం పార్టీ కేడర్ లో,ఇతర పార్టీల్లో,ప్రజలలో వ్యక్తం అవుతోంది.  మోదీ ధైర్యం ఏమిటనేది అర్ధం కావడం లేదు. 

అది అలా ఉంచితే.. జమిలీతో పాటు పలు ఎన్నికల సంస్కరణలను మేధావులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బిల్లు సభలో ప్రవేశపెట్టడానికి కావలసిన సాధారణ మేజార్టీ వచ్చింది. డిసెంబరు 12 రెండు బిల్లులను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. డిసెంబర్ 17నన్యాయశాఖ మంత్రి పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి సమర్పించారు. ఆ జేపీసీని  21మంది లోక్ సభ సభ్యులు, 10మంది రాజ్యసభ సభ్యులతో నియమించారు.  ఈ జేపీసీ తన నివేదికను సమర్పించడానికి 90 రోజుల గడువు విధించారు.  అవసరమైతే పొడిగిస్తారు. ఈ జేపీసీ ప్రధాన బాధ్యత  ప్రజాభిప్రాయ సేకరణ. అందరి అభిప్రాయాలను సేకరించి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎలాంటి నిర్ణయాధికారం లేదు.  కేవలం అభిప్రాయాలను తెలపడానికే ఇది పరిమితం. అన్నిటికీ మించి జమిలి  బిల్లు చట్టం కావాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది.  రాజ్యాంగ సవరణ చేయాలంటే  పార్లమెంటు లో 2|3మేజార్టీ అనివార్యం. లోక్ సభలో 362, రాజ్యసభ లో 164 మంది జమిలికి అనుకూలంగా ఓటు వేయాలి. అయితే ఎన్డీఏకు లోక్ సభలో 293, రాజ్యసభ లో 125 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఏదో విధంగా ఆ మద్దతు కూడగట్టినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కర్ జమిలి ఎన్నికల నిర్వహణకు సాంకేతికంగా  2034 వరకూ ఆగాల్సిందే.  కాగా భారత్లో స్వాతంత్ర్యం అనంతరం తొలి నాలుగు సార్వత్రిక ఎన్నికలు జమిలి ఎన్నికలో. అంటే జమిలి ఎన్నికలు దేశానికి కొత్తకాదు.    1960 దశకం తరువాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా తరచూ ఎన్నికలు వస్తున్నాయి. ఇదొక రాజకీయ అనివార్యంగా మారిపోయింది.

దీంతో .దేశంలో ఎక్కడో అక్కడ ఎన్నికలు జరుగుతూనే ఉన్న పరిస్థితి ఎర్పడింది.  అయితే ఇప్పుడు మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తానేదో కొత్తగా కనిపెట్టినట్లుగా జమిలి ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. కానీ బీజేపీ జమిలి నినాదంపై దేశ వ్యాప్తంగా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జమిలి పద్ధతిలో ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే భారీగా వ్యయం తగ్గుతుంది. అలాగే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి పథకాల అమలుకు అవరోధాలు చాలా వరకూ తగ్గిపోయాయి.  అలాగే జమిలి వల్ల ఖర్చు తగ్గి జీడీపీ 1.5 శాతం పెరుగుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల దేశంఆర్ధికంగా దేశం బలపడుతుందని నమ్మబలుకుతోంది.  

ఇక జమిలి వల్ల రాష్ట్రాలలో,కాని కేంద్రంలో గాని మేజార్టీ లేక ప్రభుత్వాలు పడిపోతే మళ్లీ ఎన్నికలు జరుగుతాయి, అయితే అలా మధ్యంతరంగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పదవీ కాలం తరిగిపోతుంది.  జమిలి పద్ధతిలో దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికలతో పాటు మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.  ఇక జమిలీ జరిగిన 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు.ఎవరైనా మరణిస్తే ఉప ఎన్నికలు ఎలా జరిపిస్తారనేదానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. జమిలీ ప్రతిపాదన ఎన్నికల సంస్కరణలకు తొలి మజిలీగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జమిలి పద్ధతి అమలులోకి వస్తే ఒక అభ్యర్థి ఒక స్థానం నుంచి మాత్రమే పోటీ చేయాలన్న నిబధనను అనివార్యంగా విధించాల్సి ఉంటుంది.  అలా కాకుండా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధిస్తు.. ఆ అభ్యర్థి రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానానికి జరిగే ఉప ఎన్నిక వ్యయాన్ని ఆ అభ్యర్థే భరించేలా నిబంధన తీసుకురావాల్సి ఉంటుందని అంటున్నారు.  

అదే సమయంలో నేరచరితులను ఎన్నికలకు దూరంగా ఉంచే విధంగా కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.  కోర్టుల్లోకేసులు తీర్పులు వచ్చేవరకూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదన్న విషయంపై కూడా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.   జమిలీ ఎన్నికల అధ్యయనం చేసిన మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ జమిలితో పాటు ఎన్నికల సంస్కరణలు కూడా తీసుకురావాలని చేసిన సిఫారసును కేంద్రం పరిగణనలోనికి తీసుకోవాలి.   అన్నిటికంటే అతి ముఖ్యమైనది కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, స్వతంత్రంగా పని చేసే పరిస్థితి ఉండాలి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంపై కేంద్రం నియంత్రణ పెచ్చరిల్లిందన్న విమర్శలు ఉన్నాయి. వాటిని పూర్వపక్షం చేస్తూ ఎన్నికల సంఘానికి పూర్తి స్వయంప్రతిపత్తి ఉండేలా చర్యలు తీసుకుంటే మాత్రమే జమిలి ఎన్నికలకు సార్థకత ఉంటుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu