ఇప్పుడేమంటారు... మిసెస్ సుహాసినీ మణిరత్నం?



భర్త సక్సెస్‌లో వుండాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది. భర్త ఫెయిల్యూర్స్‌లో పడిపోతే  ఏ భార్య అయినా విలవిలలాడిపోతుంది. ఆయన మళ్ళీ విజయాలు సాధించాలని కోరుకుంటుంది. ఈ సైకాలజీకి సినీనటి సుహాసిని కూడా అతీతమేమీ కాదు. తన భర్త మణిరత్నం ఎప్పుడూ సూపర్‌హిట్ సినిమాలు తీయాలని, ఆ సినిమాల రివ్యూలు రాసే మీడియావాళ్ళు అదరహో, బెదరహో అని పొగడాలని కోరుకోవడం న్యాయమే. అయితే పాపం మణిరత్నం ఈమధ్యకాలంలో అలా పొగిడించుకునే సినిమాలు తీయలేదు. మొన్నీమధ్య వరకూ ఈ సినిమా మణిరత్నమే తీశాడా... లేక తన అసిస్టెంట్ డైరెక్టర్‌తో తీయించాడా అనే సందేహం వచ్చే సినిమాలే తీశాడు. ఈమధ్యకాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తాపడటమే కాదు... విమర్శకుల నుంచి కూడా అక్షింతలు జల్లించుకున్నాయి.

ఇది సుహాసిని మణిరత్నానికి ఎంతమాత్రం నచ్చలేదు. తన భర్త గొప్ప కళాఖండాలు తీస్తున్నప్పటికీ మీడియావాళ్ళు, రివ్యూలు రాసేవాళ్ళు వాటిని కావాలనే చెత్తసినిమాలని రాస్తున్నారని అపోహ పడిపోయారు. మణిరత్నం దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘ఓకే బంగారం’ మీద కూడా అలాగే బ్యాడ్ రివ్యూలు రాసేస్తారని ఆమె భయపడిపోయారు. వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన భర్త సినిమాల రివ్యూలు ‘క్వాలిఫైడ్ క్రిటిక్స్’తోనే చేయించాలని షరతులు విధించారు. అనర్హులు రివ్యూలు చేయడం వల్లే మంచి సినిమాలు అన్యాయమైపోతున్నాయని ఫీలయ్యారు. సుహాసిని మేడమ్ అలా అంటే, మణిరత్నం మాత్రం సుహాసిని ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడింది... రివ్యూలు ఎవరైనా చేయొచ్చు... రివ్యూలు ఫలానావాళ్ళే రాయాలని చెప్పడం న్యాయం కాదు అంటూ మీడియా దాడి నుంచి తెలివిగా తప్పించుకున్నాడు.

మణిరత్నం ‘ఓకే బంగారం’  శుక్రవారం నాడు విడుదలైంది. ఈ సినిమా చాలా బాగుందని రివ్యూలు వచ్చాయి. ఎవరు రివ్యూ రాసినా ‘ఓకే బంగారం’ బాగుందనే రాశారు. తమిళనాడులో మాత్రమే కాదు.... ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ సినిమా బాగుందనే రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకి రివ్యూలు రాసినవాళ్ళందరూ గతంలో రివ్యూలు రాసినవాళ్ళే. సుహాసిని మేడమ్ గారు చెప్పారు కదా అని ఎక్కడినుంచో ‘క్వాలిఫైడ్ క్రిటిక్స్’ వచ్చి రివ్యూలు రాయలేదు. గతంలో మణిరత్నం సినిమాలు బాగాలేదని రివ్యూలు రాసినవాళ్ళే ఇప్పుడు ‘ఓకే బంగారం’ సినిమా బాగుందని రివ్యూలు రాశారు. మరి ఇప్పుడు సుహాసిని గారు ఏమని సమాధానం చెబుతారు? రివ్యూలు ఫలానావాళ్ళు రాస్తేనే బాగా రాస్తారనే అపోహలను ఆమె ఇప్పటికైనా వదిలించుకుంటారా? రివ్యూలు రాసేది ఎవరైనా సినిమా ఎలా వుంటే అలాగే రాస్తారు. మణిరత్నం మీదో, సుహాసినిమీదో, మరో సినీ ప్రముఖుడి మీదో కోపమో, ద్వేషమో పెట్టుకుని రివ్యూలు రాయరు. పాపం రివ్యూలు రాసేవాళ్ళమీద సుహాసిని పెట్టుకున్న అపనమ్మకం నిజమే అయితే ‘ఓకే బంగారం’ సినిమా కూడా బాగాలేదని రాసేవాళ్ళే కదా! ఏమంటారు సుహాసిని గారూ?

అంచేత సుహాసిని గారూ... మణిరత్నం గారు కావచ్చు... మరే సినిమా మేకర్ అయినా కావచ్చు... మంచి సినిమాలు తీయండి... మంచి రివ్యూలు అందుకోండి.. అంతేతప్ప మీ సినిమాకు మీరు కోరినట్టుగా రివ్యూలు రాయాలని, ఫలానా వాళ్ళే రివ్యూలు రాయాలని కోరుకోవడం అత్యాశ మాత్రమే కాదు.. దురాశ కూడా అవుతుంది. మీడియాతో ఎలా మెలగాలో మీ భర్తగారికి తెలిసిన దాంట్లో మీకు కొద్దిగా కూడా తెలిసినట్టు లేదు... కొంచెం ఆయన్ని అడిగి తెలుసుకోకూడదూ!?