ఈ మృగాళ్లు మారరా?

 


ఎన్నిచట్టాలొచ్చినా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు మాత్రం ఆగటంలేదు. ఎంతో మంది యువతులు ప్రేమోన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనల గురించి వింటుంటే అసలు ఆడపిల్లలుగా పుట్టడమే తప్పా? అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, మనుషుల మధ్యనే ఉన్నామా అన్న సందేహం వస్తుంది. కొంతమంది ప్రేమించలేదని చంపేస్తారు, కొంతమంది ప్రేమించి చంపేస్తారు. మొత్తానికి ఆడవాళ్లను మాత్రం చంపకుండా ఉండట్లేదు ఈ ప్రేమోన్మాదులు. వాళ్లలో ఉన్న రాక్షసత్వానికి ఆడపిల్లలు బలైపోతున్నారు. అలా ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించట్లేదని చంపడానికి వెళ్లి తనే ఆ అమ్మాయి తండ్రి చేతిలో చనిపోయాడు.  

 

హైదరాబాద్ నగరం కూకట్ పల్లిలో ఓ కన్నతండ్రి ఓ ప్రేమాన్మాదిని కొడవలితో నరికి చంపిన ఘటన శనివారం వెలుగు చూసింది. ఆ ప్రేమోన్మాది యువతిపై కొడవలితో దాడి చేసినప్పుడు ఆమె తండ్రి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కూతుర్ని కాపాడుకోవడం కోసం అతనిని చంపాడు. ఒకవేళ ఆ సమయంలో ఆ తండ్రి అక్కడ లేకపోతే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో ఊహించుకోవడానికే భయమేస్తోంది. కుటుంబం మొత్తం అతని రాక్షసత్వానికి బలైపోయి ఉండేది.

 

సమాజంలో చైతన్యం ఎంత పెరిగినా కొంతమంది మృగాళ్ల మనసు మాత్రం మారటంలేదు. నిర్భయ చట్టం, షీ టీమ్ అంటూ ప్రభుత్వాలు ఆడపిల్లలకు ఎన్ని రకాలుగా రక్షణ కల్పించినా అవి ప్రేమోన్మాదుల్లో భయాన్ని మాత్రం కలిగించలేకపోయాయి. అసలు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయపడుతున్నారు. ఈ పరిస్థితి మారేదెన్నడో... ఆడపిల్లలకు మంచి రోజులు వచ్చేదెప్పుడో.