స్వర్గీయ యన్టీఆర్ పేరుపై ఇంత రభస అవసరమా?

 

శంషాబాద్ విమానాశ్రయంలో జాతీయ టెర్మినల్ కి స్వర్గీయ యన్టీఆర్ పేరు పెట్టడంపై పార్లమెంటులో కాంగ్రెస్, తెరాస మరి కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన యంపీలు తీవ్ర అభ్యంతరం చెపుతూ, కేంద్రం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గట్టిగా కోరుతున్నారు. ఆంధ్రాకు చెందిన యన్టీఆర్ పేరును తెలంగాణా రాష్ట్రానికి చెందిన విమానాశ్రయానికి పెట్టడం అంటే అది తమపై పెత్తనం చెలాయించడమేనని వారి వాదన. ఆ విధంగా చేసి తెలంగాణా ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ కూడా దీనిని వ్యతిరేఖిస్తూ తీర్మానం చేసిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రాలో ఇప్పుడు ఉన్న విమానశ్రయాలకో లేకపోతే ఇక ముందు కట్టబోయే అంతర్జాతీయ విమానాశ్రయాలకో ఆయన పేరు పెట్టుకోమని సలహా ఇస్తున్నారు. అయితే

 

ఈరోజు తమ ప్రజల మనోభావాలు దెబ్బ తింటున్నాయని వాదిస్తున్నవారే ఒకప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లక్షలాది ఆంద్ర రాష్ట్ర ప్రజలు ఉద్యమాలు చేసినప్పుడు అవన్నీ భూటకపు ఉద్యమాలని వారిని పట్టించుకొనవసరం లేదని వాదించారు. అప్పుడు వారు ఆంధ్ర ప్రజల మనోభావాలు, ఆందోళనలు అంతా భూటకమని చాలా తేలికగా తీసిపడేసారు. కానీ ఇప్పుడు తెలంగాణా ప్రజలు ఏ ఒక్కరు ముందుకు వచ్చి అభ్యంతరం చెప్పకపోయినా వారి మనోభావాలు దెబ్బ తినేస్తున్నాయని వీరే కనిపెట్టి చెప్పేస్తున్నారు.

 

ఇక ఆనాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. అప్పుడు అది నాలిక గీసుకోవడానికి కూడా పనికి రాదని వీ. హనుమంత రావు, కే.కేశవ రావు పెద్దలు అందరూ బల్లగుద్ది వాదించారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణా అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మాత్రం కేంద్రం గౌరవించాలని వాదించడం విడ్డూరం.

 

ఇక మన రాష్ట్రానికి చెందని మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ పేరుపెట్టుకోవడానికి వారికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. బోఫర్స్ కుంభకోణంలో నిందితుడిగా పేర్కొనబడినప్పటికీ వారికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని నిలబెట్టిన ఒక అచ్చమయిన తెలుగువాడు స్వర్గీయ యన్టీఆర్ పేరు పెట్టేందుకు మాత్రం వారికి చాలా అభ్యంతరాలున్నాయి. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపజేసి, తెలుగు బాష కోసం అహరహం తపించిన వ్యక్తి వారికి ఆంధ్రాకు చెందిన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మాత్రమే కనబడుతున్నారు.

 

ఈవిధంగా ఒకరొకరిని ఏరుకొంటూ, పంచుకొంటూపోతే చివరికి మిగిలేదెవరు? మహనీయులకు, స్వాతంత్ర సమరయోధులకు, చివరికి దేవుళ్ళకూ కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు అంటగట్టి వారిని కూడా పంచుకొనే దుస్థితికి చేరుకొన్నందుకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

 

రాష్ట్ర విభజనలో ఒకవైపు తమ అధిష్టానానికి సహకరిస్తూనే మరోవైపు ఆంద్ర ప్రజలను చివరి నిమిషం వరకు మభ్యపెట్టిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేతలు మరో క్షమార్హం కాని తప్పు మళ్ళీ చేస్తున్నారు. పార్లమెంటు సభ్యులయిన చిరంజీవి, కావూరి సాంబశివరావు, జెడి శీలం, కే.వి.పి. రామచంద్రరావు తదితర కాంగ్రెస్ యంపీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందిన వారయినప్పటికీ, వారు కూడా తెలంగాణా యంపీలతో కలిసి దేశీయ టెర్మినల్ కు యన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సభలో హడావుడి చేస్తున్నారు. ముఖ్యంగా సినీ రంగం నుండే వచ్చిన చిరంజీవి కూడా యన్టీఆర్ పేరును వ్యతిరేకించడం చాలా దారుణం. యన్టీఆర్ కు ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రజలు కోరుకొంటుంటే, చిరంజీవి మాత్రం విమానాశ్రయానికి కూడా ఆయన పేరు పెట్టడానికి వీలు లేదని అభ్యంతరం వ్యక్తం చేయడం చాలా విచారకరం. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినప్పటికీ వారి తీరు మారలేదని దీనిని బట్టి అర్ధమవుతోంది.