ఏసీబీ కోర్టులో రేవంత్.. రోజూ సంతకం చేస్తున్నా వేధిస్తున్నారు

 

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టులో హజరయ్యారు. అయితే గతంలోనే రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో హాజరవ్వాలి కానీ హైకోర్టు రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో కోర్టుకు హాజరుకాలేకపోయారు. ఇదే విషయాన్నిరేవంత్ రెడ్డి కూడా తెలయజేశారు. తనను కోర్టు తన నియోజకవర్గం అయిన కొడంగల్ నుండి ఎక్కడికి వెళ్లొద్దని చెప్పిన నేపథ్యంలో తాను కోర్టుకు హాజరుకాలేదని తెలియజేశారు. అయితే తదుపరి విచారణకు మాత్రం తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయమూర్తి చెప్పడంతో ఈరోజు రేవంత్ రెడ్డి ఇంకా ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలు కూడా కోర్టుక హాజరయ్యారు. అయితే చార్జిషీట్ విచారణ తర్వాత కోర్టుకు హాజరుకావాలని చెప్పినా ఎందుకు వచ్చారంటూ న్యాయమూర్తి వారిని ప్రశ్నించగా ఏసీబీ అధికారులు ముందు విచారణకు హాజరుకావాలని... కోర్టుకు వెళ్లాలని సూచించడంతో కోర్టుకు వచ్చామని చెప్పారు. కాగా.. రోజూ ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లి సంతకం చేస్తున్నా వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఉదయసింహా న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 14వ తేదికి వాయిదా వేశారు.