వైసీపీ కాదు.. వై ఛీ పీ.. ఇది జనం మాట.. చంద్రబాబు

పట్టభద్రులు ఇచ్చిన తీర్పు వచ్చే ఎన్నికలలో జగన్ ఎదుర్కొనబోయే పరాజయానికి నాంది. జనం వైసీపీని తిరస్కరించారు. ఆ పార్టీ వైసీపీ కాదు, వై ఛీపీ అని జనం అంటున్నారు. అహంకారంతోఅహంకారంతో విర్రవీగుతున్న జగన్ రెడ్డికి పట్టభద్రులు గుణపాఠం చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, అరాచకత్వమే పాలన అనుకుంటున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టభద్రులు కొర్రు కాల్చి వాత పెట్టారు. ఇంతటి అరాచకత్వాన్ని తాను జీవితంలో చూడలేదని తెలుగుదేవం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు.  

పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి  భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇది అధికార వైసీపీకి కచ్చితంగా జీర్ణించుకోవడానికి సాధ్యం కాని విషయమే. అయినా తప్పదు వాస్తవాన్ని అంగీకరించాలి. అలా అంగీకరించేసినట్లైతే అది వైసీపీ పార్టీ ఎందుకు ఔతుంది. అందుకే తెలుగుదేశం అభ్యర్థి విజయాన్ని ప్రకటించిన రిటర్నింగ్ అధికారి కమ్ కలెక్టర్ డిక్లరేషన్ పత్రం మాత్రం ఇవ్వలేదు. అలా ఇవ్వవద్దంటూ స్వయంగా సీఎం ఫోన్ చేసి ఆమెను ఆదేశించారని చెబుతున్నారు. ఏది ఏమైనా శనివారం రాత్రి తెలుగుదేశం అభ్యర్థి విజయాన్ని ప్రకటించిన తరువాత డిక్లరేషన్ పత్రం ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అక్షింతలు వేసి మరీ ఆదేశించిన తరువాతే ఆదివారం మధ్యాహ్నం ఇచ్చారు. ఈ లోగా కావలసినంత హై డ్రామా నడిచింది.  డిక్లరేషన్ పత్రం ఎందుకు ఇవ్వరంటూ తెలుగుదేశం శ్రేణులు ఆందోళణకు దిగాయి.

దీంతో అర్ధరాత్రి వారిని విజయం సాధించిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. బలవంతంగా తరలించారు. తెలుగుదేశం అధినేత ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విజయం సాధించిన అభ్యర్థికి అధికారిక పత్రం ఇచ్చి తీరాలి. ఈ విషయం ఘనత వహించిన వైసీపీ అధినాయకత్వానికి తెలియకపోయినా రిటర్నింగ్ అధికారికి తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. కాదు కాదు తెలిసి తీరాలి. అయినా ఆమె నిస్సహాయంగా ఉండిపోయారు. తాను విధి ప్రకారం చేయాల్సిన క్రతువును చేయకుండా మిన్నకుండిపోయారు. ఇంతా చేసి అధికార వైసీపీ ఏమైనా బావుకుందా అంటే ఏమీ లేదు. కేంద్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారికి అక్షింతలు వేసి మరీ ఆదేశాలు జారీ చేసిన తరువాత రిటర్నింగ్ అధికారి బతిమలాడుకుని మరీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ పత్రం ఇవ్వాల్సి వచ్చింది. ఈ మొత్తం తతంగంలో నష్టపోయినదెవరయ్యా అంటూ మళ్లీ వైసీపీయే. జగన్ ప్రభుత్వమే.  ప్రభుత్వం  ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని… ప్రజా తీర్పును కూడా లెక్క చేయకుండా అహంకారం తలకెక్కి వ్యవహరిస్తోందన్న ముద్రను మరింత బలంగా పడేలా చేసుకుంది.  

జగన్ సర్కార్  అధికారంతో ఏమైనా చేయవచ్చన్న   దురహంకారంతో వ్యవహరిస్తున్న విషయం మరోసారి రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో విజయం తెలుగుదేశం పార్టీకి నిజంగా ఒక నైతిక బలాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఇలాకా పులివెందులలో సైతం తెలుగుదేశం అభ్యర్థి ఘనమైన మెజారిటీ సాధించారు. అలాగే వైసీపీకి కంచుకోటగా ముద్రపడిన పులివెందులలో ఆ పార్టీకి జనం పెట్టిన వాత కీలెరిగిపెట్టిన చందంగా ఉంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ మూడు స్థానాలలోనూ తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లి విరుస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం (మార్చి 19)న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగంలో ఈ సంగతి ప్రస్ఫుటంగా ప్రతిఫలించింది.  ముఖ్యంగా పశ్చిమ రాయలసీమలో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం వైసీపీపై ప్రజలలో వ్యక్తమౌతున్న ఆగ్రహానికి అద్దంపట్టినట్లుగా ఉంది. అందుకే చంద్రబాబు ఈ విజయాన్ని ప్రజా విజయంగా అభివర్ణించారు.

జగన్ రెడ్డి సర్కార్ పై ప్రజల తిరుగుబాటుగా ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయాన్ని పేర్కొన్నారు.  చైతన్యం, బాధ్యతతో వచ్చి ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశారని తెలిపారు. ఉగాది పంచాంగాన్ని ప్రజలు రెండ్రోజులు ముందే చెప్పారని చంద్రబాబు అన్నారు.నాలుగేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారనీ, విధ్వంస పాలన చేశారని చంద్రబాబు విమర్శించారు.  ఒక్క చాన్స్ అంటూ గద్దెనెక్కిన జగన్ రెడ్డికి జనం మరో చాన్స్ ఇవ్వరనీ, వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ గెలిచే పరిస్థితి లేదనీ చెప్పారు.  జగన్ బాధ్యతలేని వ్యక్తి అని, మోసాలు చేయడంలో దిట్ట అని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, టీడీపీది జనబలం అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.