ఏపీలో ఉన్నది ఏ రాజ్యాంగం? వైసీపీకి చట్టాలు వర్తించవా?

ఏపీలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదు.  సమన్యాయం అన్న పదానికే అర్ధం కనిపించడం లేదు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘిస్తున్నదన్న విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఆ వ్యవస్థ విపక్ష నేతల పట్ల ఒకలా.. అధికార పార్టీకి చెందిన వారి విషయంలో మరోలా వ్యవహరిస్తున్నది.

తాజాగా తెలుగుదేశం నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టు విషయంలో పోలీసు శాఖ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలౌతున్నది. బండారు అరెస్టు విషయంలో పోలీసులు న్యాయస్థానానికే తప్పుడు సమాచారం ఇచ్చారని తేటతెల్లమైంది. నిబంధనలతో పని లేదు.. అరెస్టు చేయాలని జగన్ సర్కార్ అనుకుంటే చాలు.. పోలీసులకు నిబంధనలు, ప్రొసీజర్స్ గుర్తుకు రావు. ఏదో విధంగా అరెస్టు చేసేయడమే. చంద్రబాబు విషయంలో ఏపీ సీఐడీ అలాగే వ్యవహరించింది. సాంకేతిక అంశాల కారణంగా గత పాతిక రోజులుగా చంద్రబాబు నిర్బంధంలోనే ఉన్నారు. న్యాయనిపుణులు సహా అందరూ చంద్రబాబుది అక్రమ అరెస్టు అని ఉద్ఘాటిస్తూనే ఉన్నారు. 

తాజాగా పోలీసులు బండారు సత్యనారాయణను అరెస్టు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టడంతో బండారు సోదరుడు హై కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. కానీ పోలీసులు బండారు సత్యనారాయణకు నోటీసులు ఇచ్చినట్లు న్యాయమూర్తికి తెలిపడంతో ఆయన విచారణ చేయలేదు. అదే అదునుగా తీసుకుని పోలీసులు బండారును అరెస్టు చేశారు. వాస్తవానికి పోలీసులు నిజంగానే నోటీసులు ఇచ్చి ఉండే బండారును విచారణకు పిలవాలి తప్ప అరెస్టు చేయడానికి అవకాశం లేదు.  కానీ పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి మరీ అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, మంత్రి రోజానూ దూషించారంటూ  కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు.  

ఈ అరెస్టు ఏపీలో భారత రాజ్యాంగం కాకుండా ఒక ప్రత్యేక రాజ్యాగం అమలులో ఉందన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉంది. ముఖ్యమంత్రిని, రోజానూ దూషించారంటూ బండారును అరెస్టు చేయడానికి నిబంధనలను సైతం తుంగలోకి తొక్కడమే కాకుండా, న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించిన పోలీసులకు, నిత్యం బూతుల పంచాగంతో విపక్ష నేతలపై విరుచుకుపడే వైసీపీ నేతలు కనిపించడం లేదా, వారి దూషణలు వినిపించడం లేదా అని సామాన్యులు సైతం నిలదీస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ నేతలకు చట్టాలు వర్తించవా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.