TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆత్మ లేని దైవదూషణ: రామాయణ్ పై నితీష్ భరద్వాజ్ నిప్పులు.. రావణుడిని హీరోగాచూపారంటూ ఆగ్రహం.!

Published on: Sat Nov 21, 2026 4:59PM

భారత చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రపంచవ్యాప్త స్థాయిలో నిర్మితమైన  రామాయణ్: పార్ట్ 1  చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న వేళ, ఆ సినిమా కథనం,  పాత్రల చిత్రీకరణపై   వివాదం రాజుకుంది. ప్రముఖ నటుడు, పండితుడు,  లోక్‌సభ మాజీ సభ్యుడు, అంతే కాకుండా బీఆర్ చోప్రా  మహాభారత్ సీరియల్‌లో శ్రీకృష్ణుడి పాత్రతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నితీష్ భరద్వాజ్,  నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రామాయణ సినిమాపై నిప్పులుచెరిగారు.  రామాయణ్ పార్ట్ వన్ సినిమాను ఆయన ఆత్మ లేని దైవదూషణగా అభివర్ణించారు. ఈ సినిమా ఒక నిర్దిష్ట ఎజెండాతో తీసిన చిత్రమని సంచలన ఆరోపణలు చేశారు. అసలు గ్రంథాల పట్ల అవగాహన లేని నేటి యువతరాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇందులో శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని కించపరిచి, రావణుడిని ఒక గొప్ప నాయకుడిగా ఆవిష్కరించారని దుమ్మెత్తి పోశారు. కేవలం కలెక్షన్ల లెక్కల కంటే, మన పవిత్ర ఇతిహాసాలను తెరపై ఆవిష్కరించే క్రమంలో అసలు సారాంశాన్ని వక్రీకరించే హక్కు ఎవరికి ఉందనే మౌలిక ప్రశ్నను ఆయన తెరపైకి తెచ్చారు.   


ఈ సినిమాలో ప్రధాన పాత్రలను మలిచిన తీరుపై నితీష్ భరద్వాజ్  ఘాటుగా విమర్శలు గుప్పించారు. మర్యాద పురుషోత్తముడిగా భారతీయులు ఆరాధించే శ్రీరాముడిని ఎలాంటి భావోద్వేగాలు లేని, ఒక సామాన్య, బలహీన వ్యక్తిగా కుదించి చూపించారనీ, అదే సమయంలో  మరోవైపు, రావణుడిలోని దుష్ట లక్షణాలను, అహంకారాన్ని పూర్తిగా పక్కనపెట్టి, అతడిని ఒక   ఉదారవాదిగా, సామాజిక న్యాయం కోసం పోరాడే   నాయకుడి తరహాలో  చూపించారని ఆరోపించారు. రావణుడు అంతటి నీతిమంతుడు, న్యాయవంతుడు అయినప్పుడు, అతడిని సంహరించడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. బలహీనుడిగా చూపించిన రాముడు, అత్యంత శక్తిమంతుడిగా, హీరోగా ఆవిష్కరించబడిన రావణుడిని రెండో భాగంలో ఎలా వధిస్తాడని, ఇది కథలోని అసలు నైతిక చట్రాన్నే తలకిందులు చేస్తోందని భరద్వాజ్ విశ్లేషించారు.   నితీష్ భరద్వాజ్ ఈ చిత్రం పట్ల మొదటి నుంచీ వ్యతిరేకతతో లేరనే విషయం గమనార్హం. నవంబర్ 5, 2026న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 59 వేల స్క్రీన్లపై ఈ చిత్రం విడుదలైంది. అంతకుముందు విడుదలైన ట్రైలర్ చూసినప్పుడు భరద్వాజ్ ఈ ప్రాజెక్టుపై ఎంతో నమ్మకం వ్యక్తం చేశారు.  దంగల్,  చిచోరే  వంటి చిత్రాలను తీసిన నితీష్ తివారీ దర్శకత్వ ప్రతిభ, ఏఆర్ రెహమాన్  హన్స్ జిమ్మర్ సంగీతం, భారీ బడ్జెట్ చూసి ఈ సినిమాకు ఆస్కార్ అవార్డులు కూడా వస్తాయని ఆయన  ప్రశంసించారు. ఇంతటి భారీ ప్రాజెక్టు కోసం కచ్చితంగా రామాయణ పండితుల సలహాలు తీసుకుని ఉంటారని  భావించారు. అయితే, నవంబర్ 10న పూర్తి సినిమా చూసిన తర్వాత ఆయన అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని పేర్కొంటూ, గతంలో తాను పెట్టిన ప్రశంసా పూర్వక పోస్టును వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కేవలం విజువల్ ఎఫెక్ట్స్) మాయాజాలం ఈ మహాకావ్యంలోని తాత్విక లోతును, ఆధ్యాత్మిక సారాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేవని   స్పష్టం చేశారు.  

ఇదే విషయంపై నవంబర్ 13న మరోసారి స్పందిస్తూ, యువత సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంలో పడకుండా ప్రామాణికమైన పుస్తకాలు చదవాలని సూచించిన భరద్వాజ్.. నవంబర్ 19న ఇచ్చిన ఒక ప్రత్యేక టెలివిజన్ ఇంటర్వ్యూలో తన విమర్శల దాడిని మరింత పెంచారు.  2 వేల కోట్ల రూపాయల  బడ్జెట్‌తో మొదటి భాగం, మొత్తం నాలుగువేల కోట్ల రూపాయల వ్యయంతో  రెండు భాగాలుగా నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ఆర్థిక మూలాలపై  నితీష్ భరద్వాజ్ అనుమానాలు వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్‌కు లక్సెంబర్గ్, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల నుంచి నిధులు అందాయని ఆరోపిస్తూ, ఈ డబ్బు వెనుక ఏదైనా విదేశీ కుట్ర,  ఎజెండా దాగి ఉందా అనే కోణంలో   విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే సమయంలో, వాల్మీకి రామాయణానికి భిన్నంగా ఉన్న ఈ కథనానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ సర్టిఫికెట్ ఎలా జారీ చేసిందని నిలదీశారు. సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి స్వయంగా ఈ సినిమా చూసి ఉండకపోవచ్చని అభిప్రాయపడుతూనే..  కమిటీ సభ్యులు ఈ వక్రీకరణను ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. 

భారత సమాజంలో రామాయణం అనేది కేవలం ఒక సాహిత్య గ్రంథం మాత్రమే కాదు, అది కోట్లాది మంది దైనందిన జీవితంలో, సంస్కృతిలో భాగమైన ఒక జీవన విధానం. 1980వ దశకం చివర్లో దూరదర్శన్‌లో ప్రసారమైన రామానంద్ సాగర్  రామాయణ్, బీఆర్ చోప్రా  మహాభారత్  సీరియళ్లు ఎలాంటి కమర్షియల్ హంగులూ లేకుండా, భక్తిభావంతో సాగి ఒక తరాన్ని ప్రభావితం చేశాయి. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఐమాక్స్  ఫార్మాట్‌లో రూపొందుతున్న భారీ చిత్రాలు నాటకీయత పేరుతో కథా స్వరూపాన్ని మారుస్తున్నాయి. 2023లో వచ్చిన  ఆదిపురుష్ చిత్రంపై చెలరేగిన వివాదం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 2024 జనవరిలో అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ తర్వాత దేశంలో నెలకొన్న సామాజిక, రాజకీయ వాతావరణం నేపథ్యంలో రాముడి పాత్ర చిత్రీకరణ అత్యంత సున్నితమైన అంశంగా మారింది.  మాజీ ఎంపీ   నితీష్ భరద్వాజ్ తన విమర్శల్లో కొన్ని రాజకీయ ప్రస్తావనలు కూడా చేశారు. జార్జ్ సోరోస్, రాహుల్ గాంధీ వంటి పేర్లను ప్రస్తావిస్తూ, గతంలో ఔరంగజేబు ఆలయాలను ధ్వంసం చేసినట్లుగా, మెకాలే విద్యావిధానం భారతీయ సంస్కృతిని దెబ్బతీసినట్లుగా, నేడు ఈ సినిమా ద్వారా సాంస్కృతిక దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు. అయితే..  ధర్మవీర్ భారతి రచించిన  అంధ యుగ్ నాటకంలో మహాభారత మూలాలను మార్చకుండానే దుర్యోధనుడి మనస్తత్వాన్ని విశ్లేషించిన తీరును ఉదాహరిస్తూ..  సృజనాత్మక పునర్వివరణకు, ఉద్దేశపూర్వక వక్రీకరణకు మధ్య ఉన్న తేడాను నితీష్ భరద్వాజ్ ఎత్తి చూపారు. 

ఇది కూడా చదవండి:  పార్ట్ 2 లో రణబీర్, యష్ కాదు: ప్రధాన ఆకర్షణ ఆ స్టార్ హీరో అంట..బాంబ్ పేల్చిన ప్రముఖ నటుడు!

ఈ వివాదంలో ప్రధాన స్రవంతి వినోద మీడియా వ్యవహరించిన తీరుపై కూడా భిన్నమైన చర్చ నడుస్తోంది. విడుదలైన మొదటి వారాంతంలోనే  500 కోట్లు, 14 రోజుల్లోనే భారతదేశంలో 1,000 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా ₹1,519 కోట్ల రికార్డు వసూళ్లను సాధించిన ఘనతను మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. సాంకేతిక హంగులు, బాక్సాఫీస్ రికార్డుల కోణంలోనే సమీక్షలు వచ్చాయి తప్ప..  ఇతిహాసంలోని ఆధ్యాత్మిక, నైతిక విలువల కోణంలో విశ్లేషణలు జరగలేదని విమర్శకులు భావిస్తున్నారు.  హిందూ ఇతిహాసాలను ఇష్టానుసారం మార్చి సినిమాలు తీస్తున్న చిత్ర పరిశ్రమ, ఇస్లాం, క్రైస్తవం లేదా జుడాయిజం వంటి మతాల విషయంలో ఇలాంటి సాహసం చేయగలదా  అంటూ నిలదీశారు.  నితీష్ భరద్వాజ్ లేవనెత్తిన ఈ అభ్యంతరాలు కేవలం ఒక సాధారణ విమర్శగా మిగిలిపోయే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఈ విమర్శలు చేసింది ఏదో సోషల్ మీడియా ట్రోలర్ కాదు.  స్వయంగా కృష్ణుడి పాత్రలో జీవించి, పురాణాలపై లోతైన అవగాహన ఉన్న ఒక నటుడు మాజీ ప్రజాప్రతినిధి. ఈ పరిణామం 2028లో విడుదల కానున్న ‘రామాయణ్: పార్ట్ 2’ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మొదటి భాగంలో రావణుడిని ఒక ఆకర్షణీయమైన, న్యాయమైన వ్యక్తిగా చూపించి, ప్రేక్షకుల సానుభూతిని అతడి వైపు మళ్లించిన తర్వాత, రెండో భాగంలో రాముడి చేతిలో రావణ సంహారాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనేది నిర్మాతలకు పెను సవాలుగా మారనుంది.  

రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విదేశీ నిధుల మూలాలపై భరద్వాజ్ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అదేవిధంగా, పౌరాణిక,  చారిత్రక ఇతివృత్తాలతో తెరకెక్కే సినిమాలకు సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో సెన్సార్ బోర్డు ఇకపై మరింత కఠినమైన నిబంధనలను అమలు చేస్తుందా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. భారత చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ పెట్టుబడులతో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రాలకు కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే కాకుండా, అత్యున్నతమైన సాంస్కృతిక జవాబుదారీతనం కూడా అవసరమని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

మీకు నచ్చవచ్చు:  బయటపడిన అసలు నిజం: రామాయణలో బ్రహ్మ ఏఐని వాడారు..ప్రూఫ్ ఇదిగో!  

Ramayana: కలెక్షన్లు ఎక్కువ.. ఫుట్‌ఫాల్స్ తక్కువ.. అసలు లెక్కలేంటి.?

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా  https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

 [Nitish Bharadwaj,  Ramayana Controversy, Nitesh Tiwari, Ravana, Charactarisation, TeluguOne]