ప్రధాని రేసులో నితిన్ గడ్కరీ?
posted on Jun 23, 2025 12:34PM

బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, నాగపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రధాన మంత్రి పదవిని ఆశిస్తున్నారా? ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయా? ప్రయత్నాలు ప్రారంభించారా? అంటే అటు నుంచి అటువంటి సంకేతాలే వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా రెండు రోజుల కిందట నితిన్ గడ్కరీ తమ రాజకీయ భవిష్యత్ గురించి చేసిన వ్యాఖ్యలు నాగపూర్ నుంచి ఢిల్లీ వరకు పరివార్ వర్గాల్లో సంచలనంగా మారినట్లు తెలుస్తోంది.
, రెండు రోజుల కిందట ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నితిన్ గడ్కరీ.. 2029 ఎన్నికల్లో తమ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇంత వరకు చూసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అంటూ మర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో గడ్కరీ తాను ప్రధాని రేసులో ఉన్నాననే సంకేతాలు పంపుతున్నారని రాజకీయ, పరివార్ వర్గాల్లో చర్చ మొదలైందని అంటున్నారు. అయితే.. ఆ వెంటనే గడ్కరీ, బీజేపీలో ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలో పార్టీ నిర్ణయిస్తుందనీ.. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే, ఆ బాధ్యత నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని కొంత క్లారిటీ ఇచ్చారు. అయితే.. అందులోనూ పార్టీ ఆదేశిస్తే ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాననే సంకేతం ఉందని పార్టీ వర్గాలు గుసగుసలు పోతున్నాయి.
అదలా ఉంచితే.. ప్రధాని నరేంద్ర మోదీ, స్వయం ప్రకటిత సార్వజనీన రిటైర్మెంట్ ఏజ్ 75 కి చేరువలో ఉన్న సమయంలో.. గడ్కరీ ప్రధాని కుర్చీలో కర్చీఫ్ వేయడం మరింత ఆసక్తిని రేకేత్తిస్తోందని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో మూడు నెలలలో.. అంటే సెప్టెంబర్ 17 న 75 ఏళ్లు దాటి దాటి 76వ పడిలో అడుగు పెడతారు. అంటే.. రిటైర్మెంట్’ ఏజ్ లోకి అడుగు పెడుతున్నారు. అదలా ఉంటే.. మరో వంక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిటైర్మెంట్ గురించి,మోదీ వారసుని గురించి.. ఇటు పార్టీ, పరివార్ వర్గాల్లో ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంత చర్చ అయితే.. మొదలైనట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.
అయితే.. నిజంగా మోదీ ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అనే విషయంలో పెద్దగా అనుమనాలు లేవు. ఇటు పార్టీ నుంచి గానీ అటు పరివార్ నుంచి గానీ అటువంటి సంకేతాలు, సూచనలు ఏవీ కనిపించడం లేదు. నిజానికి, 2029 ఎన్నికల తర్వాత కూడా మోదీ నే ప్రధాని అని అమిత్ షా సహా ముఖ్య నాయకులు మరి కొందరు అనేక సందర్భాలాలో స్పష్టం చేశారు. అలాగే.. ఇప్పటికైతే మోదీ మనసు కూడా రిటైర్మెంట్ ఆలోచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. సో.. మోదీ రిటైర్మెంట్ తీసుకుంటారా, లేదా అనే విషయం పక్కన పెడితే.. బీజేపీ, సంఘ్ పరివార్ వర్గాల్లో గత కొంత కాలంగా ప్రధాని మోదీ వారసుడు ఎవరన్న.. చర్చ జరుగుతోందన్నది మాత్రం కాదన లేని వాస్తవం. నిజానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమత్రి యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా తో పాటుగా మరికొన్ని పేర్లు కూడా ప్రధాని రేసులో ఉన్నట్లు మీడియా చర్చల్లో వినిపిస్తున్నాయి. సో .. 2029 ఎన్నికల్లో కొత్త చిత్రం’ చూస్తారు అంటూ చేసిన గడ్కరీ ప్రకటన.. సమయం సందర్భం దృష్ట్యా కూడా ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.
నిజానికి.. ఇప్పుడే కాదు గతంలోనూ ప్రధాని పదవికి గడ్కరీ పేరు ప్రముఖంగా తెరపైకొచ్చింది. ముఖ్యంగా.. 2019సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో సౌమ్యు డు, వివాద రహితుడుగా పేరున్న గడ్కరీ ప్రధాని రేసులో ఉంటారనే చర్చ జరిగింది. అయితే.. 2019లో ఆ అవసరం రాలేదు. బీజేపీ సొంతంగానే మెజారిటీ (303) సాధించింది. ఎన్డీఏ మెజారిటీ మరింత పెరిగింది. మోదీ మళ్ళీ ప్రధాని అయ్యారు. 2024లో బీజేపీ సొంత బలం కొంత తగ్గినా.. చంద్రబాబు, నితీష్ కుమార్ చెరో చేయి వేయడంతో మోదీ మూడవసారి ప్రధాని అయ్యారు. సో.. ఇప్పటికిప్పుడు మోడీ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకునే పరిస్థితి అయితే లేదు. అయితే.. 2029 నాటికి, పరిసస్థితి ఎలా ఉంటుందో, ఎన్నెన్ని మార్పులు వస్తాయో చెప్పలేము. అందుకే ఎందుకైనా మంచిదని, గడ్కరీ కర్చీఫ్ వేసి ఉండవచ్చని బీజేపీ, పరివార్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.