ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి : సిద్దరామయ్య
posted on Jul 10, 2025 3:56PM

కర్ణాటకకు తానే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం సిద్దరామయ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి హైకమాండ్ తొలగిస్తుందనే వార్తలు అవాస్తవని సీఎం అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టబడి ఉంటామని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌కు సీఎం అవ్వాలన్న ఆశ ఉండటంలో తప్పు లేదని సిద్దరామయ్య తెలిపారు."ముఖ్యమంత్రి పదవిలో పూర్తి ఐదేళ్లు నేనే ఉంటాను. ఈ విషయాన్ని జులై 2వ తేదీన డీకే శివకుమార్ సమక్షంలోనే స్పష్టం చేశాను. ఆయన కూడా సీఎం పదవికి పోటీదారుడే, అందులో తప్పేమీ లేదు. అయితే 'ప్రస్తుతం కుర్చీ ఖాళీగా లేదు' అని ఆయనే అన్నారు కదా" అని సిద్ధరామయ్య గుర్తు చేశారు.
డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన అంగీకరించారు. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే అంశంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, నిధుల కొరత లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, ముఖ్యంగా ఈడీని కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు