దేశంలోనే మోస్ట్ వాంటెడ్ గా తెలంగాణ వాసి

 

జాతీయ పరిశోధన సంస్థ -ఎన్‌ఐఏ తాజాగా 258 మందితో కూడిన మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాను ప్రకటించింది.ఈ జాబితాలో తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా సారంగాపూర్‌కు చెందిన గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావును  దేశంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ వ్యక్తిగా పేర్కొన్న ఎన్‌ఐఏ ఆయనను పట్టిచ్చిన వారికి 15 లక్షల రూపాయల బహుమతిని ప్రకటించింది.గణపతి ఒకప్పటి పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ నుంచి నక్సల్‌ కార్యకలాపాల్లో క్రియాశీల పాత్ర పోషించినవారు.15 రాష్ట్రాల్లో విస్తరించిన నక్సల్స్‌ దళాలకు అధినేత.2017లో గణపతి బిహార్‌లోని గయ ప్రాంతంలో సంచరించినట్లు ఇంటెలిజెన్స్‌ నివేదికలు పేర్కొన్నాయి.కానీ సరైన ఆచూకీని కనిపెట్టలేకపోయాయి.గణపతి తరువాత మావోయిస్టు నాయకత్వ శ్రేణిలో రెండోస్థానంలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజ్‌పై కూడా ఎన్‌ఐఏ 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.భారీ విస్ఫోటకాల తయారీలోనూ, సాయుధ మిలటరీ వ్యూహరచనలోనూ కేశవరావును సుప్రసిద్ధుడిగా చెబుతారు.

 

 

ఎన్‌ఐఏ ప్రకటించిన జాబితాలో 15 మంది మహిళలు కూడా ఉన్నారు.మరో 15 మంది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు.వీరిలో లష్కరే తయీబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ అగ్రనేత సలాహుద్దీన్‌, ముంబై దాడుల సూత్రధారి జకీర్‌ రెహ్మాన్‌ లఖ్వి, అమెరికన్‌ జైల్లో ఉన్న డేవిడ్‌ హెడ్లీ, జునైద్‌ అక్రమ్‌ మాలిక్‌, సాజిద్‌ మజిద్‌ ప్రధములు.ఈ జాబితాలో ఉన్న వారిలో 98పై రెడ్‌కార్నర్‌ నోటీసుంది. ‘‘వీరిని అరెస్టు చేయడానికి మీ సాయం కావాలి. పట్టిచ్చినా ఆచూకీ చెప్పినా బహుమతి. మీ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది’’ అని ఎన్‌ఐఏ తన ట్విటర్‌లో పేర్కొంది.