తదుపరి ఉప రాష్ట్రపతి .. నితీషా? గడ్కరీయా?

ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖడ్ చేసిన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఇక ఇప్పుడు నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం. ఇక్కడే ధన్ ఖడ్ రాజీనామాకు కారణాలేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు, ధన్ ఖడ్ రాజీనామాకూ ముడి పెడుతూ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ ఎలాగైనా విజయం సాధించితీరాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే ధన్ ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవిని బీహార్ కు చెందిన నాయకుడితో భర్తీ చేయాలని భావిస్తోంది. అసలు అలా బీహార్ కు చెందిన నేతను  ఉప రాష్ట్రపతి చేయాలన్న ఉద్దేశంతోనే ధన్ ఖడ్ చేత రాజీనామా చేయించిందా? అన్న అనుమానాలు కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అదంతా వేరే చర్చ. ఇప్పుడు ఇక ధన్ ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవిని ఎవరితో భర్తీ చేస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. ధన్ ఖడ్ స్థానంలో ఎవరు అన్న విషయంలో రాజకీయవర్గాలలో పలు పేర్లు తెరమీదకు వస్తున్నాయి. నితిన్ గడ్కరీ నుంచి నితీష్ కుమార్ దాకా ఈ పేర్ల జాబితా కొండవీటి చాంతాడంత ఉందని అంటున్నారు. అయినా అన్ని పేర్లలోనూ ప్రముఖంగా వినవస్తున్న పేర్లు మాత్రం నితిన్ గడ్కరి, బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పేర్లు ఉన్నాయి. 

అయితే ఈ ఇద్దరూ కూడా క్రియాశీల రాజకీయాలలో చాలా చాలా చురుకుగా ఉన్నవారే. వీరు క్రియాశీల రాజకీయాలకు దూరం కావడానికి అంగీకరిస్తారా? ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టడానికి అంగీకరిస్తారా? అంటే సందేహమే అన్న అభిప్రాయమే పరిశీలకుల నుంచి వినవస్తుంది.  ముందుగా నితిన్ గడ్కరీ విషయాన్నే తీసుకుంటే..  ప్రధాని పదవికి రేసులో ఉన్న నితిన్ గడ్కరినీ సైడ్ లైన్ చేయడానికి మోడీ షా ద్వయం వ్యూహాత్మకంగా ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. అయితే అందుకు నితిన్ గడ్కరీ ఎందుకు అంగీకరిస్తారన్న ప్రశ్న కూడా గట్టిగా వినిపిస్తోంది. అయినా బీహార్, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్ కు నచ్చని పని చేసే ధైర్యం మోడీ, షా చేస్తారా? అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.

ఎవరు కాదన్నా.. మోడీకి ప్రత్యామ్నాయం నితిన్ గడ్కరి అన్న భావన సంఘ్ పరివార్ లో బలంగా ఉంది. 75 సంవత్సరాల పరిమితిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ నొక్కి మరీ ప్రస్తావించడం వెనుక మోడీ ఇక ప్రధానిగా దిగిపోవాలన్న సూచనే ఉందని అంటున్నారు. ఒక వేళ మోడీ 75 ఏళ్ల పరిమితికి తలొగ్గి  దిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడితే.. నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ మద్దతు, ఆశీర్వాదాలతో పీఎం పదవి రేసులో ముందు వరుసలో ఉంటారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వంటి వారిని బీజేపీ ప్రతిపాదించి రేసులో నిలబెట్టినా వారంతా నితిన్ తరువాతి స్థానాలకే పరిమితమైతారని పరిశీలకులు అంటున్నారు. 

ఈ నేపథ్యంలో.. వ్రతం చెడినా ఫలం దక్కితే చాలన్నట్లుగా బీజేపీ అధినాయకత్వం బీహార్  ఎన్నికలపైనే దృష్టినంతా కేంద్రీకరిస్తుందంటున్నారు.  బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి ఇప్పుడు ఓ సవాల్ గా మారింది. సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న నితీష్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన అంత చురుకుగా వ్యవహరించలేకపోతున్నారు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఆరోగ్యం కూడా సరిగా లేదని అంటున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ, జేడీయూ సీఎం ఫేస్‌గా ఈ సారి నితీష్‌ను కాకుండా కొత్త వ్యక్తిని చూపించాలనుకుంటున్నారు. అయితే సీఎం నితీష్ ను తప్పించడం వల్ల బలమైన వర్గం అసంతృప్తికి గురైతే మొదటికే మోసం వస్తుంది. అందుకే నితీష్ ను అత్యున్నతంగా గౌరవిస్తున్నామని చెప్పేందుకు ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. నితీష్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే.. సుదీర్ఘకాలంగా సీఎం పదవిలో ఉన్న నితీష్ పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఈ తరుణంలో నితీష్ ను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ ఎన్నికలకు వెళ్లడం ఆత్మహత్యాసదృశంగా బీజేపీ భావిస్తోంది. అందుకే నితీష్ కు ఉపరాష్ట్రపతి తాయిలం ఇచ్చి పక్కన పెడితే.. బీహార్ లో విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందన్న అంచనాతో ఉంది. అందుకే నితీష్ ను ఉపరాష్ట్రపతిగా ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రతిపాదనకు నితీష్ అంగీకరిస్తారా అన్నదే చూడాల్సి ఉంది. ఇంకా ఉపరాష్ట్రపతి రేసులో శిశిథరూర్ పేరు కూడా వినిపిస్తోంది. అసలింతకీ బీజేపీ వ్యూహం ఏమిటి?  తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu