మళ్ళీ పెట్రో మంటలు
posted on Dec 15, 2011 8:22AM
న్యూఢి
ల్లీ: పెట్రోలు ధరలను పెంచడానికి ప్రభుత్వ రంగ సంస్థలకు గనుక రాజకీయ అనుమతి లభించిన పక్షంలో పెట్రోలు ధరలు ఈ వారంలో లీటరుకు 65 పైసలు పెరుగుతాయి. డాలరుతో రూపాయి విలువ డాలరుకు 53.75 ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో చమురు దిగుమతుల వ్యయంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా పెరిగి పోయాయని ఓ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో పక్షం రోజుల క్రితం బ్యారెల్‌కు 108.25 డాలర్లు ఉన్న ముడి చమురు ధర ఈ నెలలో 111.11 డాలర్లకు పెరిగి పోయింది. పెట్రోలుపై కంపెనీలకు వస్తున్న నష్టం 55 పైసలనుంచి 56 పైసల దాకా ఉంది. స్థానిక అమ్మకం పన్నులు లాంటి వాటిని కలుపుకొంటే ఢిల్లీలో పెట్రోలు ధర పెరుగుదల 65, 66 పైసలుండవచ్చునని ఆయన చెప్పారు. పెట్రోలు ధరలపై కంపెనీల సమీక్ష గురువారం జరుగుతుందని, ధరల్లో మార్పు ఏదయినా ఈ నెల 16నుంచి అమలులోకి వస్తుందని కూడా ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో గత నెల రోజుల్లో చమురు కంపెనీలు పెట్రోలు ధరలను రెండు సార్లు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ప్రతి 15 రోజులకో సారి ధరలను మార్చే ఆనవాయితీ ప్రకారం చమురు కంపెనీలు ధరలను పెంచుతాయో లేదో కూడా చెప్పలేమని ఆ అధికారి చెప్పడం గమనార్హం.