గోదావరి జిల్లాల్లో డేంజర్ వైరస్... భయంతో వణికిపోతున్న జనం...

ప్రపంచాన్ని కరోనా వణికిస్తే... ఉభయగోదావరి జిల్లాలను మాత్రం వీవీఎన్డీ వైరస్ భయపెడతోంది. కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతుంటే... వీవీఎన్డీ వైరస్ దెబ్బకు వందలకొద్ది బాయిలర్ కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అయితే, బాయిలర్ కోళ్లకు సోకుతున్న వీవీఎన్డీ వైరస్ కారణంగా చికెట్ అమ్మకాలను నిలిపివేశారు. వీవీఎన్డీ వైరస్ సోకిన కోళ్లను తింటే జనం రోగాల బారినపడే ప్రమాదం ఉండటంతో పశ్చిమగోదావరి జిల్లాలో చికెన్ హాలీడే ప్రకటించారు. ముఖ్యంగా తణుకులో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో వారంరోజులపాటు చికెన్ అమ్మకాలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో బాయిలర్ కోళ్లు, ఫౌల్ట్రీ కోళ్లు వీవీఎన్డీ వైరస్ బారినపడి పిట్టల్లా రాలిపోతుండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చనిపోయిన కోళ్లను ఊళ్లకు దూరంగా తీసుకెళ్లి మట్టిలో పూడ్చిపెడుతున్నారు. అయితే, ఒక్క తణుకులోనే కాకుండా పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్లకు ఈ వైరస్ వ్యాపించిందని అంటున్నారు. దాంతో, వీవీఎన్డీ వైరస్ సోకకుండా కోళ్లకు ముందే టీకాలు వేయిస్తున్నారు రైతులు.

అయితే, వీవీఎన్డీ వైరస్ వార్తలతో ఉభయగోదావరి జిల్లాల్లో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. చికెన్ తినడానికి జనం భయపడిపోతున్నారు. అయితే, కోడి మాంసాన్ని  100 డిగ్రీల వేడిలో వండి తినేవారికి ఎలాంటి అనారోగ్యం కలగదని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, ఇప్పటికే ఒకపక్క కరోనా వైరస్ కల్లోలం కలవరం పుట్టిస్తుండటంతో... చికెన్ తినడానికి జనం భయపడుతున్నారు.